Wedding Season: మళ్లీ మోగనున్న పెళ్లి బాజాలు.. నెల రోజుల పాటు తిరుగులేని శుభ ఘడియలు
అధిక జ్యేష్ఠ మాసం ముగియడంతో శుభముహూర్తాల సీజన్ మళ్లీ ప్రారంభమైంది. జూన్ 16 నుంచి జులై 12 వరకు వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలకు అనుకూలమైన సుముహూర్తాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి నెలకొనగా, బంగారం, వస్త్రాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగాల్లో వ్యాపారాలు జోరందుకున్నాయి..

ఏలూరు, జూన్ 16: గత కొన్ని వారాలుగా అధిక జ్యేష్ఠ మాసం కారణంగా నిలిచిపోయిన శుభకార్యాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. శూన్య మాసాల ప్రభావం దాటి, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ముహూర్తాల కాలం మళ్లీ వచ్చేసింది. నేటి నుంచి (జూన్ 16) తెలుగు ఇళ్లలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. నిజ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం కావడంతో, జులై 12వ తేదీ (బహుళ త్రయోదశి) వరకు వరుసగా అత్యంత బలమైన సుముహూర్తాలు ఉన్నాయని ప్రముఖ వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న ముహూర్తాలు కావడంతో ప్రతీ రోజూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వరకాతిరుమల పంచాంగ కర్త కాసిభోట్ల పార్వతిశ్వర శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ మరియు జులై నెలల్లో వివాహాది శుభకార్యాలకు తిరుగులేని ముహూర్తాలు కుదిరాయి.
జూన్, జులై నెలల్లో ఉన్న శుభ ముహూర్తాల తేదీలు ఇవే!
ఈ ముహూర్తాల సీజన్ జూన్ నెల రెండో సగం నుంచి ప్రారంభమై, జులై రెండో వారం వరకు నాన్-స్టాప్‌గా సాగనుంది. వేద పండితుల పంచాంగ గణనం ప్రకారం జూన్ నెలలో అత్యధికంగా ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. జూన్ 16, 17, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28 తేదీల్లో వరుసగా కల్యాణ ఘడియలు ఉన్నాయి. అలాగే జులై నెల ప్రారంభంలోనూ మంచి రోజులు కుదిరాయి. జులై 1, 6, 7, 9, 10, 11 తేదీల్లో వివాహాలు నిశ్చయించుకోవడానికి, లగ్న పత్రికలు రాసుకోవడానికి అత్యంత అనుకూలమైన రోజులుగా పండితులు నిర్ణయించారు.
కేవలం పెళ్లిళ్లే కాదు.. గృహప్రవేశాలు, శంకుస్థాపనలకూ ఇదే మంచి సమయం
ఈ ముహూర్తాల సీజన్ కేవలం వివాహాలకే పరిమితం కావడం లేదు. కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టేందుకు చూస్తున్న వారికి నూతన గృహ ప్రవేశాలు చేయడానికి, కొత్త వ్యాపారాలు లేదా నూతన కట్టడాలకు శంకుస్థాపనలు నిర్వహించడానికి ఈ కాలం అత్యంత శ్రేష్ఠమైనదిగా భావిస్తున్నారు. అంతేకాకుండా, పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, ప్రతిష్ఠాత్మక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఇదే కాలంలో భారీ ఎత్తున చేపట్టేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, మంగళకర వాతావరణం నెలకొంది.
జోరందుకున్న మార్కెట్లు.. వ్యాపారుల్లో కొత్త ఉత్సాహం
వరుస ముహూర్తాల నేపథ్యంలో మార్కెట్లలో వ్యాపారాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వారు రెండు, మూడు నెలల ముందే అప్రమత్తమై కల్యాణ మండపాలను బుక్ చేసుకోవడంతో ప్రస్తుతం ఎక్కడా చూసినా మండపాల కొరత కనిపిస్తోంది. ఇటు బంగారు ఆభరణాల దుకాణాలు, కొత్త వస్త్రాల షోరూమ్‌లు, పూజా సామాగ్రి విక్రయ కేంద్రాలు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు డిజిటల్ మీడియా యుగంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ టీమ్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. పెళ్లి వాయిద్యాల కళాకారులు, క్యాటరింగ్ నిర్వాహకులకు చేతినిండా పని దొరకడంతో ఈ సీజన్ అందరి జీవితాల్లోనూ ఆర్థికంగా కొత్త వెలుగులు నింపుతోంది. దాదాపు నెల రోజుల పాటు సాగనున్న ఈ మంగళకర సీజన్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.




