AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరింత చిరాకు తెప్పిస్తోన్న NTA తీరు.. నీట్ అభ్యర్థులకు మరో కొత్త తలనొప్పి

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించి ఎన్‌టీఏ విడుదల చేసిన అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 4 లక్షల మంది మాత్రమే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. సర్వర్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌టీఏ వెల్లడించింది..

మరింత చిరాకు తెప్పిస్తోన్న NTA తీరు.. నీట్ అభ్యర్థులకు మరో కొత్త తలనొప్పి
NEET Re-Exam Admit Card Issues
Srilakshmi C
|

Updated on: Jun 16, 2026 | 7:42 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 16: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తీరు మరోసారి తీవ్ర విమర్శల పాలవుతోంది. గత నెలలో నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం కారణంగా పరీక్షను రద్దు చేసి, జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదల చేసిన అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. జూన్ 14న అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచినట్లు ఎన్‌టీఏ ప్రకటించినప్పటికీ, డౌన్‌లోడ్ లింక్ సరిగా పనిచేయకపోవడంతో పలువురు విద్యార్థులు హాల్‌టికెట్లను పొందలేకపోతున్నారు. సోమవారం ఉదయం వరకు కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.

సర్వర్‌పై అధిక భారం, సాంకేతిక లోపాల కారణంగానే ఈ సమస్యలు తలెత్తినట్లు NTA తెలిపింది. సమస్యలను పరిష్కరించేందుకు తమ సాంకేతిక బృందం నిరంతరం పనిచేస్తోందని, వీలైనంత త్వరగా అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని ఎన్‌టీఏ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా, ప్రధాన డౌన్‌లోడ్ లింక్ పనిచేయకపోవడంతో ఎన్‌టీఏ ప్రత్యామ్నాయ లింక్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ చాలా మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోలేకపోతున్నట్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు.

మరోవైపు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌కు ముందు ఫీజు రీఫండ్‌కు సంబంధించిన బ్యాంకు వివరాలను ధ్రువీకరించడం తప్పనిసరి చేయడంపై కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు వివరాలను నమోదు చేయడానికి వెళ్లినప్పుడు పాత వివరాలు కనిపించడం లేదని, ‘రీఫండ్ అవసరం లేకపోతే ముందుకు వెళ్లండి’ అనే సందేశం రావడం గందరగోళానికి దారితీస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్‌టీఏ ఎక్స్ పోస్టుల కింద విద్యార్థులు తమ సమస్యలను వెల్లడిస్తూ, అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ కావడంలేదనీ ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు స్క్రీన్‌షాట్‌లను జత చేస్తూ సాంకేతిక లోపాలను వివరించారు. రాత్రి గంటల తరబడి ప్రయత్నించిన తర్వాత మాత్రమే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోగలిగామని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్ష తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అడ్మిట్ కార్డుల సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్‌టీఏను కోరుతున్నారు.

Follow Us