AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan Tips: లోన్ ఏదైనా కట్టిన వడ్డీ తిరిగి రావాలంటే.. ఇలా చేయండి..

నేటి కాలంలో లోన్ తీసుకోవడం చాలా ఈజీగా మారింది. చాలా మంది రుణం తీసుకొని ఇల్లు లేదా కారు కొంటారు. కానీ రుణం తీసుకున్న తర్వాత మీరు అసలు కంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు రుణంపై చెల్లించిన వడ్డీని తిరిగి పొందడం ఎలానో తెలుసా..?

Loan Tips: లోన్ ఏదైనా కట్టిన వడ్డీ తిరిగి రావాలంటే.. ఇలా చేయండి..
Home Loan Interest Recover
Krishna S
|

Updated on: Aug 14, 2025 | 6:55 AM

Share

ఇల్లు, కారు కొనడం అనేది చాలామందికి ఒక పెద్ద కల. ఈ కలను నిజం చేసుకోవడానికి చాలామంది లోన్స్ తీసుకుంటున్నారు. అయితే రుణాన్ని సులభంగా పొందుతున్నా, దానితో వచ్చే భారీ వడ్డీ భారం భయపెడుతుంది. ముఖ్యంగా 15-20 సంవత్సరాల దీర్ఘకాలిక రుణాల్లో మనం అసలుకంటే వడ్డీ రెట్టింపు చెల్లిస్తాం. అయితే తెలివైన పద్ధతిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా, మనం బ్యాంకుకు చెల్లించిన వడ్డీని తిరిగి పొందే అవకాశం కూడా ఉంది.

ఈఎంఐ చెల్లిస్తూనే ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టడం ఎలా?

మీరు ఒక లోన్ తీసుకున్నప్పుడు, వడ్డీని తిరిగి పొందేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. లోన్ ఈఎంఐ చెల్లించడం ప్రారంభించిన మొదటి నెల నుంచే, మీరు ఒక ఎస్ఐపీని కూడా ప్రారంభించాలి. ఎస్ఐపీ అంటే మ్యూచువల్ ఫండ్లలో ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం. ఈ పద్ధతిలో మీరు చెల్లించే ఈఎంఐ మొత్తంలో 20-25శాతం వరకు ప్రతి నెలా ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు మీ ఈఎంఐ.. రూ.20వేలు అయితే మీరు రూ.4,000 నుండి రూ.5,000 వరకు ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల లోన్ వ్యవధి పూర్తయ్యే సమయానికి, మీ పెట్టుబడిపై మంచి రాబడి వస్తుంది. ఈ రాబడి మొత్తం మీరు లోన్‌పై చెల్లించిన వడ్డీకి దాదాపుగా సమానంగా ఉంటుంది.

క్లియర్ కట్‌గా చెప్పాలంటే..

ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే..దానిపై వడ్డీ రేటు 9.5శాతం ఉందని అనుకుందాం.

నెలవారీ ఈఎంఐ: దాదాపు రూ.28,000

20 ఏళ్లలో బ్యాంకుకు చెల్లించే మొత్తం: రూ.67 లక్షలు

చెల్లించిన వడ్డీ: దాదాపు రూ.37 లక్షలు

ఇప్పుడు ఆ వ్యక్తి తన ఈఎంఐలో 25శాతం అంటే రూ.7,000 ను ప్రతి నెలా ఎస్ఐపీలో పెట్టుబడి పెడితే, 20 ఏళ్ల తరువాత 12శాతం వార్షిక రాబడితో అది దాదాపుగా రూ.64 లక్షలు అవుతుంది. ఇలా చేయడం ద్వారా మీరు లోన్ కోసం చెల్లించిన మొత్తం వడ్డీని తిరిగి పొందవచ్చు. దీంతో మీపై వడ్డీ భారం చాలా వరకు తగ్గుతుంది.

ఈ విధానం వల్ల లాభాలు:

వడ్డీ భారం తగ్గుతుంది: లోన్ ఈఎంఐతో పాటు ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు చెల్లించిన వడ్డీని తిరిగి పొందవచ్చు.

ఆర్థిక క్రమశిక్షణ: ప్రతి నెలా ఈఎంఐతో పాటు ఎస్ఐపీ చెల్లించడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.

ఈ విధంగా లోన్ ఈఎంఐని చెల్లిస్తూనే ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఒకేసారి రెండు లక్ష్యాలను సాధించవచ్చు. మీ రుణాన్ని తిరిగి చెల్లిస్తూనే, మీ భవిష్యత్తు కోసం ఒక పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..