ఏందయ్యా ఈ కార్ క్రేజ్.. ధర చెప్పకముందే ఎగబడ్డ జనం.. కేవలం 6 నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైన ఎస్‌యూవీ..!
Skoda Kodiaq RS India: భారతీయ ప్రీమియం కార్ల మార్కెట్లో కస్టమర్ల అభిరుచులు ఎంతలా మారుతున్నాయో చెప్పడానికి స్కోడా కోడియాక్ ఆర్‌ఎస్ సాధించిన రికార్డే నిదర్శనం. ధరతో సంబంధం లేకుండా కేవలం బ్రాండ్ విలువ, నమ్మకం, అద్భుతమైన పవర్ కోసం ఆరు నిమిషాల్లోనే స్టాక్ మొత్తం కొనేయడం నిజంగా భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక అరుదైన మైలురాయి.

Skoda Kodiaq RS India: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ చరిత్రలోనే ఇది ఒక కళ్లు చెదిరే అద్భుతం. సాధారణంగా ఏ కారైనా ధర చూసి కొంటారు. కానీ, ఇక్కడ కారు ధర ఎంతో కూడా తెలియకుండానే కేవలం 6 నిమిషాల్లో స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ప్రముఖ అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ స్కోడా సరికొత్త సంచలనానికి తెరలేపుతూ భారత మార్కెట్లో సరికొత్త మైలురాయిని సృష్టించింది.
భారత్‌లో స్కోడా సృష్టించిన సరికొత్త రికార్డు..
భారతదేశంలో లగ్జరీ, పవర్‌ఫుల్ కార్లకు ఉండే క్రేజ్ ఎలాంటిదో మరోసారి నిరూపితమైంది. ప్రముఖ చెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా, తన సరికొత్త ప్రీమియం 7-సీటర్ పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ స్కోడా కోడియాక్ ఆర్‌ఎస్ (Skoda Kodiaq RS) కోసం బుకింగ్‌లను ప్రారంభించిన కొద్దిసేపటికే దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కంపెనీ మొదటి విడతగా దేశంలోకి తీసుకొచ్చిన 50 యూనిట్లు కేవలం ఆరు నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైపోయాయి. ధర కూడా ప్రకటించకముందే ఈ స్థాయిలో బుకింగ్‌లు రావడం మార్కెట్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
ధర తెలియకపోయినా రూ. 3 లక్షలు కట్టి మరీ కొనుగోలు!
ఈ కారుపై ఉన్న క్రేజ్ ఏ స్థాయికి చేరిందంటే, కంపెనీ దీని అధికారిక ధరను వచ్చే వారంలో ప్రకటించనుంది. అయినప్పటికీ, వాహన ప్రియులు ఏమాత్రం వెనుకాడకుండా రూ. 3 లక్షల టోకెన్ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించి మరీ ఈ వాహనాన్ని సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. గతంలో స్కోడా సంస్థకు చెందిన ‘ఆక్టేవియా ఆర్‌ఎస్’ మోడల్ కూడా ఇలాగే భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే, అప్పట్లో ఆ స్టాక్ మొత్తం అమ్ముడవడానికి 20 నిమిషాల సమయం పట్టగా, తాజా కోడియాక్ ఆర్‌ఎస్ కేవలం 6 నిమిషాల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర లిఖించింది.
కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా స్పోర్ట్స్ కార్ లాంటి పవర్!
స్కోడా కోడియాక్ ఆర్‌ఎస్ ఇంతటి అపూర్వ విజయాన్ని అందుకోవడానికి దాని ప్రత్యేకతలే ప్రధాన కారణం. సాధారణంగా పెద్ద కుటుంబాల కోసం కొనుగోలు చేసే 7-సీటర్ ఎస్‌యూవీ కారులో రేసింగ్ కార్ స్థాయి పవర్ మరియు వేగం లభించడం చాలా అరుదు. ప్రస్తుతం అమ్ముడైన ఈ 50 కార్లు పూర్తిగా విదేశాల్లో తయారై భారతదేశానికి దిగుమతి చేసుకున్న ప్రీమియం మోడళ్లు కావడం విశేషం. ఈ అద్భుతమైన స్పందన చూస్తుంటే, మొదటి విడతలో కారుని దక్కించుకోలేకపోయిన కస్టమర్ల కోసం కంపెనీ త్వరలోనే రెండో బ్యాచ్ వాహనాలను దిగుమతి చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాకెట్ వేగంతో దూసుకెళ్లే పవర్‌ఫుల్ ఇంజన్..
ఈ పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ ఇంజన్ సామర్థ్యం, వేగం గుండెల్ని పిండేసేలా ఉంటుంది. ఇందులో 1,984 సీసీ ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. దీనికి 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జోడించారు. ఈ శక్తివంతమైన ఇంజన్ ఏకంగా 265 bhp పవర్, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం విషయానికి వస్తే, ఈ కారు కేవలం 6.3 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అలాగే దీని గరిష్ట వేగం గంటకు 231 కిలోమీటర్లుగా నమోదైంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
