House Rent Laws: ఇల్లు ఖాళీ చేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వడం లేదా..? ఈ పొరపాటు చేస్తే మీకే నష్టం..
చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. అయతే ఇల్లు ఖాళీ చేసే సమయంలో యజమాని, అద్దెదారుడి మధ్య సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో గొడవలు తలెత్తుతూ ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద గొడవలకు కూడా దారి తీస్తుంది. అసలు సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..?

నగరాలు, పట్టణాల్లో ఎక్కువమంది అద్దె ఇళ్లల్లో నివసిస్తూ ఉంటారు. అద్దెకు దిగే సమయంలో అడ్వా్న్స్ రూపంలో సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇళ్లు ఖాళీ చేసే సమయంలో ఇంటి యజమానులకు, అద్దెదారులకు మధ్య సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో వివాదాలు జరుగుతూ ఉంటాయి. పలుమార్లు పెద్ద గొడవలకు ఇది దారితీస్తుంది. అయితే అద్దెకు దిగే సమయంలో యజమాని, అద్దెదారుడి మధ్య రెంటల్ అగ్రిమెంట్లు చేసుకుంటారు. అయినా కూడా కొన్ని కారణాల వల్ల సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో అనేక సమస్యలు వస్తాయి. దీనిపై చట్టాలు ఏం చెబుతున్నాయి? సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి చెల్లించకపోతే ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
అద్దె ఒప్పందం చేసుకోవాలి..?
భారతదేశంలో అద్దె ఒప్పందాలు ప్రధానంగా రెండు ప్రధాన చట్టాల ప్రకారం జరుగుతాయి. ఒకటి ఆస్తి బదిలీ చట్టం, 1882 (TPA) కాగా.. మరొకటి మోడల్ టెనెన్సీ చట్టం, 2021గా చెప్పవచ్చు. MTAలోని సెక్షన్ 11(2) ప్రకారం అద్దెదారు ఇంటి తాళాలను అప్పగించిన వెంటనే ఇంటి యజమాని సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇవ్వాలి. ఇక ఇంటి యజమాని డిపాజిట్‌లో కొంత భాగాన్ని తన ఇష్టానుసారంగా కట్ చేసుకోవడానికి నిబంధనలు అంగీకరించవు. ఒకవేళ కట్ చేసుకుంటే ప్రతి రూపాయిని చెల్లించని అద్దె, యుటిలిటీ బిల్లులు, అద్దెదారు వల్ల నేరుగా కలిగిన నష్టాలకు మరమ్మతులు వంటి నిర్దిష్ట ఖర్చుల కోసం మాత్రమే ఉపయోగించాలి. MTAలోని సెక్షన్ 15, ఆస్తి నిర్వహణ బాధ్యతను యజమాని, అద్దెదారుడు పంచుకోవాలని స్పష్టంగా ఉంది. 2025లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం.. సెక్యూరిటీ డిపాజిట్ కింద కేవలం 2 నెలల సొమ్మును మాత్రమే తీసుకోవాలి.
సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలంటే..?
ఇంటి యజమాని సెక్యూరిటీ డిపాజిట్‌లో కొంత భాగాన్ని ఉంచుకోవాలనుకుంటే.. దానిని నిరూపించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ నష్టం అద్దెదారుడి వల్లే జరిగిందని ఆధారాలతో సహా చూపించాలి. డిపాజిట్ విషయంలో వివాదం తలెత్తినప్పుడు ఇంట్లోకి మారినప్పటి ఫోటోలు, తనిఖీ చెక్‌లిస్ట్‌లు, అసలు మరమ్మతు ఖర్చుల రసీదులతో సహా స్పష్టమైన పత్రాల రికార్డు వంటివి కలిగి ఉండాలి. అద్దెదారులు తరచుగా టీవీలను అమర్చడం, వాల్‌పేపర్ అతికించడం లేదా ఏసీ యూనిట్లను ఏర్పాటు చేయడం వంటివి చేస్తుంటారు. ఇది కొన్నిసార్లు ఇంటి యజమాని, అద్దెదారు మధ్య వివాదాలకు దారితీస్తుంది.ఆస్తికి ఎలాంటి నష్టం కలగకుండా సులభంగా తొలగించగలిగే వాటికి ఇబ్బంది ఉండదు. అయితే టైల్స్ పాడుచేసేలా పెద్ద పెద్ద రంధ్రాలు వేయడం, అడగకుండా శాశ్వత వస్తువులను అమర్చడం లాంటి వాకికి అద్దెదారుడు బాధ్యత వహించాలి. ఒకవేళ మీ తప్పు లేకుండా జరిగినా సెక్యూరిటీ డిపాజిట్ కట్ చేసుకుంటే చట్ట ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.
