మీ డబ్బులు డబుల్ చేసే స్కీమ్..! సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీతో సూపర్ సేఫ్టీ
మార్కెట్ రిస్క్ లేకుండా సురక్షిత పెట్టుబడి కోరుకునే వారికి ఇండియా పోస్ట్ FD, RD, MIS పథకాలు మంచి ఎంపికలు. ఒకేసారి పెట్టుబడి పెట్టేవారికి FD, నెలవారీ పొదుపు చేసేవారికి RD, ప్రతి నెలా స్థిర ఆదాయం కోరుకునేవారికి MIS అనుకూలం. పెట్టుబడి లక్ష్యాన్ని బట్టి సరైన పథకాన్ని ఎంచుకోవడం మంచిది.

షేర్ మార్కెట్ రిస్క్‌లకు దూరంగా ఉండి తమ పొదుపును పూర్తి సురక్షితంగా ఉంచుకోవాలనుకునే వారికి ఇండియా పోస్ట్ అందిస్తున్న పొదుపు పథకాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వ హామీతో నడిచే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD/FD), రికరింగ్ డిపాజిట్ (RD), నెలవారీ ఆదాయ పథకం (MIS) వంటి పథకాలు భిన్న అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. అయితే వీటిలో ఏది ఎంపిక చేసుకోవాలంటే.. మనం పెట్టుబడి ఎందుకు పెడుతున్నాం, ఆదాయ అవసరాన్ని స్కీమ్ ఎంచుకోవచ్చు.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనువైన స్కీమ్స్. ఇందులో కనీసం రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాల కాలపరిమితి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై వార్షికంగా 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన చక్రవడ్డీగా లెక్కిస్తారు, సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. అంతేకాకుండా ఐదేళ్ల డిపాజిట్‌కు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.50,000ను ఐదేళ్ల కాలానికి పెట్టుబడి పెట్టి, మెచ్యూరిటీ తర్వాత మరో ఐదేళ్లకు తిరిగి పెట్టుబడి పెడితే, పదేళ్ల చివరికి సుమారు రూ.1.05 లక్షలకు పైగా మొత్తం పొందే అవకాశం ఉంది. ఇందులో దాదాపు రూ.55 వేలకుపైగా వడ్డీ రూపంలో లభిస్తుంది. మరోవైపు, ప్రతి నెలా జీతం నుంచి కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేయాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) మంచి ఎంపిక. ఇందులో నెలకు కనీసం రూ.100తో ఖాతా ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై వార్షికంగా 6.7 శాతం వడ్డీ అందుతోంది. ఒకేసారి పెద్ద మొత్తం అవసరం లేకుండా, చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా జమ చేసే అవకాశం ఉండటం దీని ప్రధాన ప్రత్యేకత.
ఇక ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (MIS) అనుకూలంగా ఉంటుంది. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రస్తుతం సంవత్సరానికి 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. వడ్డీని సంవత్సరానికి లెక్కించినప్పటికీ, ప్రతి నెలా పెట్టుబడిదారుడి ఖాతాలో జమ చేస్తారు. ఉదాహరణకు, రూ.1 లక్ష పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.7,400 వడ్డీ, అంటే నెలకు సుమారు రూ.617 చొప్పున ఆదాయం పొందవచ్చు.
అయితే ఒకేసారి పెట్టుబడి పెట్టే మొత్తం ఉంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉత్తమ ఎంపిక. నెలవారీ పొదుపు అలవాటు పెంపొందించుకోవాలనుకునే వారు రికరింగ్ డిపాజిట్‌ను ఎంచుకోవచ్చు. రిటైర్డ్ ఉద్యోగులు లేదా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం అవసరమయ్యే వారు నెలవారీ ఆదాయ పథకం (MIS)ను పరిశీలించవచ్చు. పెట్టుబడి లక్ష్యం, ఆదాయ అవసరం, పొదుపు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సరైన పోస్ట్ ఆఫీస్ పథకాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
