AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉరుములు, మెరుపులు ఎలా ఏర్పడతాయి? మేఘాలలో జరిగే ఈ యుద్ధం గురించి మీకు తెలియని సీక్రెట్స్ ఇవే..

వానాకాలం వచ్చేసింది.. ఉరుములు, మెరుపులు మొదలైపోయాయి. ఆకాశంలో అకస్మాత్తుగా వచ్చే ఆ మిరుమిట్లు గొలిపే వెలుతురు, గుండెలు పగిలేలా వచ్చే ఆ భయంకరమైన శబ్దం వెనుక అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా? చాలామంది ఇవి అంతరిక్షంలో జరిగే వింతలని అనుకుంటారు. కానీ దీని వెనుక శాస్త్రవేత్తలే అవాక్కయ్యే అద్భుతమైన సైన్స్ దాగి ఉంది.

ఉరుములు, మెరుపులు ఎలా ఏర్పడతాయి? మేఘాలలో జరిగే ఈ యుద్ధం గురించి మీకు తెలియని సీక్రెట్స్ ఇవే..
How Is Lightning Formed
Krishna S
|

Updated on: Jul 13, 2026 | 5:08 PM

Share

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. పలు ప్రాంతాల్లో వానలు సైతం పడుతున్నాయి. అయితే వర్షం పడే ముందు ఆకాశంలో వచ్చే ఉరుములు, మెరుపులు చిన్నపిల్లలకే కాదు.. పెద్దవాళ్లకు కూడా వణుకు పుట్టిస్తాయి. అసలు ఆకాశంలో అంతటి వెలుతురు, గుండెలు పగిలేలా శబ్దం ఎలా వస్తాయి? దీని వెనుక ఉన్న ప్రకృతి రహస్యం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ వాతావరణ పరిశోధనా సంస్థల నివేదికలు కీలక విషయాలను వెల్లడించాయి.

ఆకాశంలో నల్లటి పర్వతాలు.. క్యుములోనింబస్ మేఘాలు..

వర్షాకాలంలో లేదా తుఫానుల సమయంలో ఆకాశంలో దట్టమైన, నల్లటి భారీ మేఘాలు కమ్ముకోవడాన్ని మనం చూస్తుంటాం. వాతావరణ శాస్త్రంలో వీటిని క్యుములోనింబస్ మేఘాలు అని పిలుస్తారు. ఇవి సాధారణ మేఘాల లాగా కాకుండా ఆకాశంలో నిలువుగా భారీ పర్వతాల వలె విస్తరించి ఉంటాయి. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. కేవలం ఈ క్యుములోనింబస్ మేఘాలకు మాత్రమే భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాన్ని కురిపించే ప్రత్యేక సామర్థ్యం ఉంది.

మేఘాల లోపల ప్రమాదకరమైన యుద్ధం..

ఈ భారీ మేఘాల లోపల వాతావరణం చాలా అస్థిరంగా, ప్రమాదకరంగా ఉంటుంది. నాసా పరిశోధనల ప్రకారం.. ఈ మేఘాల లోపల బలమైన గాలి ప్రవాహాలు విపరీతమైన వేగంతో పైకి, కిందికి వీస్తుంటాయి. భూమి ఉపరితలం నుండి పైకి వీచే వెచ్చని గాలిని అప్‌డ్రాఫ్ట్‌లు అంటారు. పై నుండి కిందికి వీచే చల్లని గాలిని డౌన్‌డ్రాఫ్ట్‌లు అంటారు. ఈ మేఘాల పైభాగంలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే చాలా తక్కువకు పడిపోతుంది. తీవ్రమైన చలి కారణంగా అక్కడి నీటి బిందువులు గడ్డకట్టి చిన్న మంచు స్ఫటికాలుగా, వడగళ్ళుగా మారిపోతాయి.

కరెంట్ ఎలా పుడుతుంది?

యూఎస్ నేషనల్ సివియర్ స్టార్మ్స్ లాబొరేటరీ ప్రకారం.. ఈ మేఘాల లోపల తేలికపాటి మంచు స్ఫటికాలు, అతిశీతల నీటి బిందువులు, బరువైన వడగళ్లు అన్నీ ఒకేసారి ఉంటాయి. కింది నుండి పైకి వీచే బలమైన గాలులు తేలికపాటి మంచు కణాలను మేఘం పైభాగానికి నెడతాయి. అదే సమయంలో గురుత్వాకర్షణ వల్ల బరువైన వడగళ్లు మేఘం అడుగు భాగానికి పడిపోతుంటాయి. ఈ క్రమంలో పైకి వెళ్లే మంచు కణాలు, కిందకు పడే వడగళ్లు ఒకదానికొకటి బలంగా ఢీకొంటూ, రాసుకుంటాయి. దీనిని వాతావరణ శాస్త్రంలో ట్రైబోఎలెక్ట్రిఫికేషన్ అని పిలుస్తారు. ఈ ఘర్షణ వల్ల ఎలక్ట్రాన్లను కోల్పోయిన చిన్న మంచు కణాలు ధనావేశాన్ని పొంది మేఘం పైభాగానికి చేరుకుంటాయి. ఎలక్ట్రాన్లను గ్రహించిన బరువైన వడగళ్లు రుణావేశాన్ని పొంది మేఘం కింది భాగానికి చేరుకుంటాయి. దీనివల్ల మేఘం లోపల ఒక భారీ విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది.

సూర్యుడి కంటే 5 రెట్ల వేడి.. అదే ఉరుము..

మేఘం పైభాగంలోని ధనావేశాలకు, అడుగున ఉన్న రుణావేశాలకు మధ్య విద్యుత్ పొటెన్షియల్ భేదం హద్దులు దాటినప్పుడు.. గాలిని చీల్చుకుంటూ విద్యుత్ ప్రవాహం చాలా వేగంగా దూసుకెళ్తుంది. ఆ కాంతినే మనం మెరుపు అని పిలుస్తాము. ఈ విద్యుత్ ప్రవాహం మేఘం నుండి నేరుగా భూమికి దూకినప్పుడు, దానిని పిడుగు అంటాం. నేషనల్ జియోగ్రాఫిక్ నివేదికల ప్రకారం.. మెరుపు ప్రసరించే మార్గంలో ఉన్న గాలి తక్షణమే సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత కంటే సుమారు 5 రెట్లు, అంటే దాదాపు 30,000 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కుతుంది. ఈ తీవ్రమైన వేడి కారణంగా గాలి అకస్మాత్తుగా వ్యాకోచించి, వెంటనే సంకోచిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల గాలిలో భయంకరమైన ధ్వని తరంగాలు పుట్టుకొస్తాయి. వాతావరణంలో ప్రతిధ్వనించే ఆ భీకరమైన శబ్దాన్నే మనం ఉరుము అని పిలుస్తాము. ఆకాశంలో మెరుపులు, ఉరుములు రావడానికి కారణం అంతరిక్షంలో జరిగే అద్భుతాలు కావు.. కేవలం మేఘాల లోపల ఉండే మంచు ముక్కలు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల జరిగే ఒక సహజమైన భౌతిక ప్రక్రియ మాత్రమే.

Follow Us