AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Player of the Month : ఐసీసీ అవార్డుల రేసులో ఇద్దరు భారత స్టార్లు.. జూన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ నామినేషన్లు విడుదల

ICC Player of the Month : ఐసీసీ జూన్ 2026 ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల నామినేషన్లలో భారత స్టార్ శుభ్‌మన్ గిల్, మహిళల స్పిన్నర్ శ్రీ చరణి చోటు దక్కించుకున్నారు. పురుషుల, మహిళల విభాగాల్లో భారత ఆటగాళ్లు ఒకేసారి నామినేట్ కావడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.

ICC Player of the Month : ఐసీసీ అవార్డుల రేసులో ఇద్దరు భారత స్టార్లు.. జూన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ నామినేషన్లు విడుదల
Icc Player Of The Month
Rakesh
|

Updated on: Jul 13, 2026 | 5:02 PM

Share

ICC Player of the Month : ఐసీసీ జూన్ (2026) నెలకు గాను అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లతో ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ నామినేషన్లను సోమవారం (జూలై 13) అధికారికంగా ప్రకటించింది. ఈ సారి ప్రకటించిన జాబితాలో భారత క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా లభించింది. పురుషుల, మహిళల రెండు విభాగాల్లోనూ భారత స్టార్ క్రికెటర్లు ఒకేసారి నామినేట్ అయ్యారు. పురుషుల విభాగంలో భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ రేసులో నిలవగా, మహిళల విభాగంలో భారత స్టార్ స్పిన్ సెన్సేషన్ శ్రీ చరణి తన అద్భుత ప్రదర్శనతో ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకుంది.

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జూన్ నెల ఎంతో అద్భుతంగా కలిసివచ్చింది. ఈ నెలలో ఆయన బ్యాటింగ్ చేసిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద పారించాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో గిల్ 126 పరుగుల అద్భుత సెంచరీ ఇన్నింగ్స్‌తో నెలను ఘనంగా ప్రారంభించాడు. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. వన్డే సిరీస్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 238 పరుగులు సాధించాడు. ఇందులో మొదటి వన్డేలో 84 పరుగులు చేయగా, రెండో వన్డేలో 154 పరుగుల భారీ సెంచరీతో జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించాడు. ఈ నిలకడైన ప్రదర్శనే అతడిని ఐసీసీ అవార్డు రేసులో నిలిచేలా చేసింది.

పురుషుల విభాగంలో శుభ్‌మన్ గిల్‌తో పాటు మరో ఇద్దరు అంతర్జాతీయ ఆటగాళ్లు నామినేషన్లలో నిలిచారు. వారిలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మొసద్దెక్ హుస్సేన్ ఒకరు. జూన్ 9 నుంచి 14 మధ్య ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో గెలుచుకుని చరిత్ర సృష్టించింది. క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. ఈ సిరీస్‌లో అల్ రౌండ్ ప్రదర్శన చేసిన మొసద్దెక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక రెండో ఆటగాడిగా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నాథన్ స్మిత్ నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కివీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేయడంలో నాథన్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అతడు అత్యధికంగా 16 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.

మహిళల విభాగంలో భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి ఐసీసీ నామినేషన్లలో నిలిచి సత్తా చాటింది. జూన్, జూలై నెలల మధ్య జరిగిన 2026 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో శ్రీ చరణి బంతితో మ్యాజిక్ చేసింది. ఈ మెగా టోర్నమెంట్‌లో కేవలం 5 మ్యాచ్‌లు ఆడిన ఆమె, ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతూ అత్యధికంగా 14 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే బెస్ట్ బౌలర్‌గా నిలిచింది. ఈ అసాధారణమైన బౌలింగ్ ప్రదర్శన కారణంగానే ఐసీసీ ఆమెను జూన్ నెలకు గాను బెస్ట్ ప్లేయర్ అవార్డు రేసులో నిలిపింది.

మహిళల విభాగంలో భారత్‌కు చెందిన శ్రీ చరణితో పాటు స్కాట్లాండ్ కెప్టెన్ క్యాథరిన్ బ్రైస్, ఇంగ్లాండ్ ఓపెనర్ డాని వ్యాట్-హాజ్ కూడా నామినేట్ అయ్యారు. స్కాట్లాండ్ కెప్టెన్ క్యాథరిన్ బ్రైస్ గత నెలలో జరిగిన టీ20 ఇంటర్నేషనల్స్ లో బ్యాటింగ్‌లో 140.15 స్ట్రైక్ రేట్‌తో 178 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లోనూ 11 వికెట్లు తీసి అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇచ్చింది. మరోవైపు ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ డాని వ్యాట్ జూన్ నెలలో 71.75 సగటుతో 287 పరుగులు చేసి అదరగొట్టింది. అంతేకాకుండా 2026 టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 302 పరుగులు చేసి టోర్నమెంట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. ఈ ముగ్గురు వరల్డ్ కప్ స్టార్ల మధ్య అవార్డు కోసం గట్టి పోటీ నెలకొంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us