చిరు వ్యాపారులు, బ్యాచిలర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో మార్కెట్లోకి సరికొత్త గ్యాస్ సిలిండర్..
చిన్న వ్యాపారులకు, బ్యాచిలర్స్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అందించనుంది. ఇకపై గ్యాస్ సిలిండర్ భారం తగ్గనుంది. బరువుతో పాటు జేబుకు కూడా కలిసొచ్చేలా.. చమురు సంస్థలు సరికొత్త కమర్షియల్ సిలిండర్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సర్వం సిద్ధం చేశాయి. ఇంతకీ ఆ సిలిండర్ ప్రత్యేకత ఏంటి? ఎవరికి ఎక్కువ లాభం చేకూరుతుంది అనేది తెలుసుకుందాం..

చిన్న వ్యాపారులు, బ్యాచిలర్స్, వలస కార్మికులకు గ్యాస్ కంపెనీలు సూపర్ న్యూస్ అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం కేవలం ఇంటి అవసరాల కోసమే పరిమితంగా అందుబాటులో ఉన్న 10 కిలోల లైట్ వెయిట్ ఎల్‌పీజీ సిలిండర్ల విషయంలో కీలక నిర్ణయానికి సిద్ధమయ్యాయి. ఇకపై కమర్షియల్ కేటగిరీలో కూడా తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. త్వరలోనే గ్యాస్ ఏజెన్సీలతో పాటు ఎంపిక చేసిన కొన్ని రిటైల్ అవుట్‌లెట్లలో కూడా ఈ చిన్న సిలిండర్లు కమర్షియల్ ధరలకు లభించనున్నాయి. ప్రస్తుతం కమర్షియల్ కస్టమర్ల కోసం మార్కెట్‌లో 19 కిలోలు, 5 కిలోలు, 2 కిలోల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే 19 కిలోల పెద్ద సిలిండర్ కొనడం, దాన్ని మోయడం చిన్న వ్యాపారులకు కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త 10 కిలోల సిలిండర్ వస్తే.. తక్కువ గ్యాస్ అవసరమయ్యే చిన్న హోటళ్లు, టీ బంకులు నడిపేవారికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం కానుంది.
ఎవరికి ఎక్కువ లాభం?
తక్కువ స్థలం ఉన్న చిన్న దుకాణాలలో 19 కిలోల పెద్ద సిలిండర్ ఉంచడం కష్టం. ఈ 10 కిలోల సిలిండర్ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. అదేవిధంగా వలస కార్మికులు, విద్యార్థులు, అద్దెకు ఉండేవారికి కూడా ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుంది. బదిలీలు లేదా రూమ్‌లు మారేటప్పుడు దీన్ని ఒక చోటు నుండి మరో చోటుకి సులభంగా తీసుకెళ్లవచ్చు.
ఈ లైట్ వెయిట్ సిలిండర్ ప్రత్యేకతలు ఏంటి?
50శాతం తక్కువ బరువు: ఈ సిలిండర్లను ఆధునిక కంపొజిట్ టెక్నాలజీతో మూడు పొరలుగా తయారు చేశారు. ఇవి సాధారణ స్టీల్ సిలిండర్ల కంటే దాదాపు 50 శాతం తక్కువ బరువు ఉంటాయి. కాబట్టి బహుళ అంతస్తుల భవనాలలో నివసించే వారైనా దీనిని చాలా ఈజీగా మోసుకెళ్లవచ్చు.
గ్యాస్ ఎంత ఉందో చూసేయొచ్చు: దీని బాహ్య భాగం పారదర్శకంగా ఉంటుంది. అంటే సిలిండర్‌లో ఇంకా ఎంత గ్యాస్ మిగిలి ఉందో బయటి నుంచే స్పష్టంగా చూసుకోవచ్చు. దీనివల్ల గ్యాస్ అకస్మాత్తుగా అయిపోతుందనే టెన్షన్ ఉండదు, ముందే బుక్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పేర్లు
ప్రస్తుతం ఈ 10 కిలోల డొమెస్టిక్ సిలిండర్లను HP సంస్థ హెచ్‌పి గ్యాస్ ఓజస్ పేరుతో, ఇండియన్ ఆయిల్ సంస్థ ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ పేరుతో, భారత్ పెట్రోలియం సంస్థ భారత్ గ్యాస్ లైట్ పేరుతో అందిస్తున్నాయి. త్వరలోనే ఇవే కంపెనీలు కమర్షియల్ మార్కెట్లోకి కూడా వీటిని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి.చిన్న వ్యాపారుల భారాన్ని తగ్గించే ఈ సరికొత్త నిర్ణయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
