మీ దుంపలు తెగ మీరెక్కడ దొరికార్రా సామీ.. కోటికిపైగా బెడ్‌షీట్లు, టవల్స్ సర్దేశారు.. ఈ లెక్కలు చూస్తే నోరెళ్లబెడతారు..
ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారి వింత బుద్ధి బయటపడింది. టికెట్ కొంటే రైల్వే ఆస్తి తన సొంత ఆస్తి అనుకుంటున్నారో ఏమో కానీ.. ప్రయాణం ముగిశాక బెడ్‌షీట్లు, తువ్వాళ్లను సూట్‌కేసుల్లో సర్దేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో ఏకంగా ఒక కోటికి పైగా బెడ్‌రోల్స్ మాయమయ్యాయంటే నమ్ముతారా? ఈ లెక్కలు చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం..

రైలు ప్రయాణంలో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారంటే సమాజంలో కాస్త ఉన్నత వర్గం లేదా విద్యావంతులు అనుకుంటాం. కానీ భారతీయ రైల్వేలో జరుగుతున్న ఒక విచిత్రమైన చోరీల పరంపర చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.. ప్రయాణం ముగిశాక రైల్వే సిబ్బంది ఇచ్చిన దుప్పట్లు, తువ్వాళ్లు, దిండ్లను గుట్టుచప్పుడు కాకుండా తమ బ్యాగుల్లో సర్దేసుకుని వెళ్తున్న ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఓ జాతీయ పత్రిక సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం.. జనవరి 2022 నుండి మే 2026 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏసీ రైళ్లలో ఏకంగా 1.27 కోట్లకు పైగా బెడ్‌రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయి. అంటే సగటున ప్రతి వెయ్యి మంది ప్రయాణికులలో ఒకరు కచ్చితంగా ఏదో ఒక వస్తువును దొంగిలిస్తున్నారు.
రూ. 104 కోట్ల నష్టం.. బలైపోతున్న పేద కార్మికులు..
ఈ నాలుగేళ్ల కాలంలో జరిగిన రైల్వే లినెన్ దొంగతనాల వల్ల కాంట్రాక్టర్లకు దాదాపు రూ. 104.51 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే ఇక్కడ అసలు విషాదం ఏంటంటే.. ఈ నష్టాన్ని కాంట్రాక్టర్లు భరించడం లేదు. రోజుకు కేవలం రూ.700 కూలికి పని చేసే అమాయక ఏసీ కోచ్ అటెండెంట్ల జీతాల నుండి ఈ డబ్బును రికవరీ చేస్తున్నారు. తమ కళ్లెదుటే ప్రయాణికులు వస్తువులు పట్టుకెళ్తుంటే ఆపలేక.. నెలకు రూ.2,000 నుండి రూ.3,000 వరకు జీతం నష్టపోతున్నామని అటెండెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువగా దొంగిలిస్తున్న వస్తువులు ఇవే
నాలుగేళ్లలో మాయమైన 1.27 కోట్ల వస్తువుల జాబితా చూస్తే ప్రయాణికులు వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది..
- ఫేస్ టవల్స్: 46.54 లక్షలు (బ్యాగులో దాచుకోవడానికి ఈజీగా ఉండటంతో ఇవే టాప్)
- బెడ్‌షీట్లు: 41.13 లక్షలు
- పిల్లో కవర్లు: 23.59 లక్షలు
- బ్లాంకెట్లు: 12.95 లక్షలు
- దిండ్లు: 2.76 లక్షలు
దొంగతనాల్లో టాప్-10 డివిజన్లు ఇవే..
దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం దొంగతనాల్లో 67శాతం వాటా కేవలం 10 డివిజన్లదే కావడం గమనార్హం.
- బికానెర్ (రాజస్థాన్): 25.76 లక్షల వస్తువుల చోరీతో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక్కడ 2022తో పోలిస్తే దొంగతనాలు 4 రెట్లు పెరిగాయి.
- రాంచీ: 9.31 లక్షలు
- ఢిల్లీ: 8.21 లక్షలు
- ముంబై: 8.17 లక్షలు
- జోధ్‌పూర్: 8.09 లక్షలు
- అహ్మదాబాద్: 6.94 లక్షలు
- దానాపూర్: 5.72 లక్షలు
సౌత్ ఇండియా గ్రేట్
ఈ దొంగతనాల జాబితాలో దక్షిణ భారతదేశం ఎంతో నయం అనిపించుకుంది. తిరుచిరాపల్లి, పాలక్కాడ్ డివిజన్ల నుండి ఒక్క లినెన్ వస్తువు కూడా చోరీకి గురైనట్లు నమోదు కాలేదు. అలాగే ఢిల్లీ (79శాతం), అహ్మదాబాద్ (83శాతం) డివిజన్లు దొంగతనాలను భారీగా తగ్గించగలిగాయి.
రైల్వే శాఖ తీసుకుంటున్న కఠిన చర్యలు
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న రైల్వే శాఖ.. దొంగతనాల అడ్డుకట్టకు సరికొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రైల్వే ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం బ్లాంకెట్స్ దొంగతనం అనేది నాన్ బైలబుల్ నేరం. అనుమానం వస్తే ప్రయాణికుల లగేజీని తనిఖీ చేసే అధికారం RPF పోలీసులకు ఉంటుంది. కోచ్‌లలో సీసీటీవీల నిఘా పెంచడంతో పాటు గ్యాస్ సిలిండర్ల లాగే లినెన్ పంపిణీని ట్రాక్ చేయడానికి కోచ్ మిత్ర యాప్‌ను వాడుతున్నారు. ప్రయాణికులు దిగడానికి 30 నిమిషాల ముందే బెడ్‌రోల్స్ తిరిగి ఇచ్చేయాలనే నిబంధనను ప్యాకెట్లపై ముద్రిస్తున్నారు.
