AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Power Connection: మీ ఇంటికి కొత్త విద్యుత్ కనెక్షన్ పొందటం ఎలా..? ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చాలా ఈజీ.. ఫీజు ఎంతంటే..?

కొత్త ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఇంటికి విద్యుత్ సరఫరా అనేది అవసరం. దీంతో కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. దీంతో దళారులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే మీరు స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

New Power Connection: మీ ఇంటికి కొత్త విద్యుత్ కనెక్షన్ పొందటం ఎలా..? ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చాలా ఈజీ.. ఫీజు ఎంతంటే..?
Power Connection
Venkatrao Lella
|

Updated on: Aug 06, 2026 | 5:41 PM

Share

సొంతింటి కల అనేది ప్రతీఒక్క సామాన్యుడి చిరకాల కోరిక. ఈ కలను నెరవేర్చుకునేందుకు కాయా కష్టం చేస్తుంటారు. తమ కష్టార్జితాన్ని కూడబెట్టుకుని సొంతిల్లు నిర్మించుకుంటారు. అయితే కొత్త ఇంటికి విద్యుత్ కనెక్షన్ అనేది అవసరం. ఇందుకోసం కొత్త కరెంట్ మీటర్ ఏర్పాటు చేసుకోవాలి. కొత్త విద్యుత్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి..? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు చాలామందికి తెలియక ఆందోళన పడుతుంటారు. దళారులను ఆశ్రయించి వేలకు వేలు ఖర్చు చేసుకుంటారు. అయితే దళారుల అవసరం లేకుండా మీరే సులభంగా కొత్త కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

కొత్త కనెక్షన్ తీసుకోవడం ఎలా..?

కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలంటే మీ ఏరియా ఏ విద్యుత్ పంపిణీ సంస్థ కిందకు వస్తుందనేది తనిఖీ చేయాలి. సమీపంలోని ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆ సంస్థ ఆన్‌లైన్ వెబ్‌సైట్లోకి వెళ్లి కొత్త కనెక్షన్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదిస్తారు. అనంతరం అధికారులు మీ ఇంటికి చేరుకుని పరిశీలిస్తారు. కనెక్షన్ ఇచ్చేందుకు మీ ఇంటి వద్ద విద్యుత్ స్తంభం ఉందా..? అక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చేందుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా..? లేదా? అనేది పరిశీలిస్తారు? కనెక్షన్ ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ధృవీకరించుకున్న తర్వాత ఫీజు వివరాలను చెబుతారు. సెక్యూరిటీ డిపాజిట్, కనెక్షన్ అందించేందుకు సర్వీస్ ఛార్జీలు, ఇతర ఫీజుల వివరాలు చెబుతారు. ఆ ఫీజు చెల్లించిన తర్వాత మీ ఇంటికి కరెంట్ మీటర్ ఏర్పాటు చేసి కనెక్షన్ అందిస్తారు.

ఏయే డాక్యుమెంట్స్ అవసరం..

ఆధార్ కార్డ్ లేదా ఇతర ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం అవసరం. అలాగే ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇక ఇంటి పన్ను రసీదు, ఇంటి నెంబర్ వివరాలు, భవన నిర్మాణ అనుమతి పత్రాలు, పాస్ పోర్ట్ సైజు ఫొటో, మొబైల్ నెంబర్ వివరాలు అందించాలి.

కరెంట్ కనెక్షన్ తీసుకునేముందు ఏం చేయాలి..?

కరెంట్ కనెక్షన్ కొత్తగా తీసుకునేముందు ముందుగా కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. అన్ని పత్రాలు ముందుగా సిద్దం చేసుకోవాలి. గుర్తింపు పత్రాల్లోని వివరాలతో దరఖాస్తు వివరాలను సరిపోల్చుకోవాలి. విద్యుత్ కనెక్షన్ ఛార్జీలను సకాలంలో చెల్లించాలి. ఇంటికి వైరింగ్ చేయించుకునే సమయంలో బాగా తెలిసిన ఎలక్ట్రీషియన్‌ను ఎంచుకోండి. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా దారఖాస్తు చేసుకోవడంతో పాటు మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

ఛార్జీలు ఇవే..

తెలంగాణలో కొత్త గృహ విద్యుత్ కనెక్షన్ కోసం 1 kW వరకు కనెక్షన్లకు రూ.500 స్థిర రుసుము చెల్లించాలి. ఇక 1 kW నుండి 5 kW వరకు ఉన్న కనెక్షన్లకు రూ.500తో పాటు ప్రతి అదనపు కిలోవాట్‌కు రూ.600 చొప్పున వసూలు చేస్తారు. ఇక ఏపీలో గృహ వినియోగదారులు మొదటి కిలోవాట్‌కు రూ.1,500,  కమర్షియల్వి నియోగదారులు రూ.1,800 చెల్లించాలి. ఆపై ప్రతి అదనపు కిలోవాట్‌కు రూ.2,000 చొప్పున 20 కిలోవాట్ల వరకు ఛార్జీలు వర్తిస్తాయి.

Follow Us