ICC Rankings : ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాటర్ స్థానం కోసం ముగ్గురు భారతీయుల పోటీ.. గిల్‌కే బంఫర్ ఛాన్స్
ICC Rankings : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రపంచ నంబర్-1 వన్డే బ్యాటర్ స్థానం కోసం పోటీ పడనున్నారు. టీ20 సిరీస్ పరాజయం తర్వాత భారత్ పరువు నిలబెట్టుకోవడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ ఆధిపత్యం చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ICC Rankings : భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుత యూకే పర్యటన అస్సలు కలిసిరాలేదనే చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత టీ20 జట్టు ఇంగ్లాండ్ చేతిలో 0-4 తేడాతో ఘోరంగా సిరీస్ ఓడిపోయింది. ఈ ఓటమితో అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ తన నంబర్ వన్ కిరీటాన్ని కూడా కోల్పోయింది. అయితే ఈ పరాభవాన్ని మర్చిపోయి మళ్లీ పుంజుకునేందుకు వన్డే సిరీస్ రూపంలో టీమిండియాకు ఒక మంచి అవకాశం లభించింది. జూలై 14 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా జట్టు పరువును కాపాడుకోవడమే కాకుండా, వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచేందుకు భారత టాప్ ఆర్డర్ ముగ్గురు ఆటగాళ్లకు సువర్ణావకాశం దక్కింది.
ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. కేవలం జట్టు పరంగానే కాకుండా, ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ భారత ఆటగాళ్ల హవా నడుస్తోంది. ప్రపంచ టాప్-4 వన్డే బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే అందులో ముగ్గురు భారతీయులే ఉండటం విశేషం. ప్రస్తుతం న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్ 815 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 791 పాయింట్లతో రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ 768 పాయింట్లతో మూడో స్థానంలో, రోహిత్ శర్మ 754 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ సిరీస్‌లో గనుక రాణిస్తే ఈ ముగ్గురిలో ఎవరైనా నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు.
రేటింగ్ పాయింట్ల పరంగా చూస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మొదటి స్థానంలో ఉన్న డారిల్ మిచెల్‌ను దాటడం ఈ మూడు మ్యాచ్‌లలో కొంచెం కష్టమైన పనే అయినప్పటికీ, ఇంగ్లాండ్ గడ్డపై వీరికున్న అద్భుతమైన ట్రాక్ రికార్డును తక్కువ అంచనా వేయలేము. ఇంగ్లాండ్ పిచ్‌లపై రోహిత్ శర్మ ఏకంగా 64.91 సగటుతో పరుగులు సాధించగా, కింగ్ విరాట్ కోహ్లీ 51.88 అద్భుతమైన యావరేజ్‌తో రాణించారు. వీరిద్దరి బ్యాట్ కనుక ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడితే రికార్డులు తారుమారవడం ఖాయం. మరోవైపు, రెండో స్థానంలో ఉన్న యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో ఒకటి లేదా రెండు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడితే, చాలా సులభంగా డారిల్ మిచెల్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా హిస్టరీ క్రియేట్ చేయవచ్చు.
ఈ యూకే టూర్‌లో భారత టీ20 జట్టు ప్రదర్శనపై అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్ చేతిలో 0-2తో చారిత్రాత్మక పరాజయాన్ని చవిచూసిన భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో 0-4తో క్లీన్ స్వీప్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ భుజాలపై దేశ పరువును నిలబెట్టాల్సిన గురుతర బాధ్యత పడింది. చరిత్ర పేజీలను తిరగేస్తే ఇంగ్లాండ్ జట్టు వన్డే క్రికెట్‌లో చివరిసారిగా 2018 సంవత్సరంలో భారత్‌పై సిరీస్ గెలిచింది. ఆ తర్వాత నుంచి వన్డేల్లో భారత్‌పై ఇంగ్లాండ్‌కు సిరీస్ గెలిచే అవకాశం రాలేదు. ఈ అజేయమైన రికార్డును అలాగే కొనసాగిస్తూ, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని గిల్ సేన పట్టుదలగా ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
