Telangana: తెలంగాణలో ఆన్‌లైన్ ఫుడ్, క్యాబ్ డెలివరీ సేవలు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
తెలంగాణలో ఆన్‌లైన్ ఫుడ్, క్యాబ్ డెలివరీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు గిగ్ వర్కర్లు రేపటి నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి బంద్ చేపట్టనున్నారు. దీంతో శనివారం నుంచి ప్రజలు ఆన్ లైన్ డెలివరీల్లో ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. శనివారం నుంచి రాష్ట్రంలో స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఉబర్, జెప్టో లాంటి యాప్ ఆధారిత క్యాబ్, ఫుడ్, గ్రాసరీ డెలివరీ సేవలు నిలిచిపోనున్నాయి. క్యాబ్, ఫుడ్ డెలివరీ యాప్ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు గిగ్ వర్కర్ల జాయింట్ యాక్షన్ కమిటీ శనివారం నుంచి బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. నిరవధికి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని నాంపల్లి గిగ్ ఆఫీసులో 16 సంఘాల నేతలు సమావేశమయ్యారు. తమ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నా.. ఎలాంటి స్పందన రాలేదు. దీంతో రేపటి నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది గిగ్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో ఆన్ లైన్ గ్రోసరీ, ఫుడ్, క్యాబ్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. యాప్ ఆధారిత ఆన్ లైన్ సేవలన్నీ బంద్ కానున్నాయి. క్యాబ్ సర్వీసులకు సంబంధించి బేస్‌ఫేర్, ప్రతీ కిలోమీటర్, ప్రతీ నిమిషానికి న్యాయపరమైన ఛార్జీలు వచ్చేలా నోటిఫై చేయాలని గిగ్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు స్ధిరమైన ఆదాయం వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అలాగే గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు గిగ్, ఫ్లాట్‌ఫాం వర్కర్ల కోసం రూల్స్ తీసుకురావాలని కోరుతున్నారు. ఇక మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా కనీస ఛార్జీలు చెల్లించేలా నోటిఫై చేయాలని కోరుతున్నారు.
గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు వాహన సేవల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ తీసుకొస్తుందనే హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా డ్రైవర్లు, గిగ్ వర్కర్ల సమస్యలు పట్టించుకోవడం లేదని, దీని వల్ల గిగ్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయమైన ఛార్జీలతో గిగ్ వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమ్మె జరగనుందని, 16 సంఘాలు పాల్గొననున్నాయని గిగ్ వర్కర్ల సంఘాలు వెల్లడించాయి.
