AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: పేసర్లు ఫెయిల్.. స్పిన్నర్లు అదుర్స్.. లంక బ్యాటర్ల దెబ్బకు టీమిండియా విలవిల

IND vs SL: శ్రీలంక XIతో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లకు లంక బ్యాటర్లు గట్టి పరీక్ష పెట్టారు. 110 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో చెలరేగగా, సిరాజ్, ప్రసిద్ధ్ విఫలమయ్యారు. జడేజా, కుల్దీప్, మానవ్ సుథార్ స్పిన్‌తో వికెట్లు తీశారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడం చర్చనీయాంశమైంది.

IND vs SL: పేసర్లు ఫెయిల్.. స్పిన్నర్లు అదుర్స్.. లంక బ్యాటర్ల దెబ్బకు టీమిండియా విలవిల
Ind Vs Sl (10)
Rakesh
|

Updated on: Aug 07, 2026 | 6:43 PM

Share

IND vs SL: కొలంబోలోని ఎన్‌సీసీ గ్రౌండ్ వేదికగా శ్రీలంక XI జట్టుతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి రోజు లంక బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక XI జట్టును భారత బౌలర్లు త్వరగానే ఆలౌట్ చేస్తారని భావించినప్పటికీ, లంక బ్యాటర్లు నిలకడగా ఆడి మంచి స్కోరు సాధించారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న కేఎల్ రాహుల్ స్లిప్‌లో ఒక సులువైన క్యాచ్‌ను నేలపాలు చేయడం కూడా భారత ఫీల్డింగ్‌లో ఉన్న లోపాలను ఎత్తిచూపింది.

తొలి వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం

భారత స్టార్ పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ శ్రీలంక ఓపెనర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. లంక ఓపెనర్లు నిషాన్ ఫెర్నాండో, రవిందు రసంత మొదటి వికెట్‌కు ఏకంగా 110 పరుగుల శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పి గట్టి పునాది వేశారు. ఫెర్నాండో 66 పరుగులు చేసి రనౌట్ రూపంలో నిష్క్రమించగా, రసంత 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 71 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన పాసిందు సూరియబండార (35)తో కలిసి రసంత రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. పాసిందును రవీంద్ర జడేజా బౌల్డ్ చేయగా, రసంతను మానవ్ సుథార్ పెవిలియన్‌కు పంపాడు.

కెప్టెన్ హాఫ్ సెంచరీ.. లంక మిడిలార్డర్ మెరుపులు

అనంతరం వచ్చిన పవన్ రత్నాయకే 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి పేసర్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక XI కెప్టెన్ సోనాల్ దినుషా బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సోనాల్ 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 52 పరుగులు చేసి మానవ్ సుథార్ బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా వెనుతిరిగాడు. మ్యాచ్ ముగిసే చివరి అరగంటలో భారత బౌలర్లు 2 వికెట్లు తీయగలిగారు. సోనాల్ కంటే ముందు రమేష్ మెండిస్‌ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు.

భారత బౌలర్ల ప్రదర్శన వివరాలు

ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు పూర్తిగా నిరాశపరచగా, స్పిన్నర్లు మాత్రమే జట్టును ఆదుకున్నారు. భారత పేసర్లలో మహమ్మద్ సిరాజ్ 13 ఓవర్లలో 44 పరుగులు, ప్రసిద్ధ్ కృష్ణ 8 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. మరొక పేసర్ గుర్నూర్ బ్రార్ 12 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా 15 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 18 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, యువ స్పిన్నర్ మానవ్ సుథార్ 13 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. సారాంశ్ జైన్ 11 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి వికెట్ ఏమీ తీయలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us