పొరపాటున నిమ్మ గింజలను తింటే ఏమవుతుంది..? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..
నిమ్మకాయ నీళ్లు తాగుతున్నప్పుడు పొరపాటున నిమ్మ గింజ గొంతులోకి జారి కడుపులోకి వెళ్లిపోయిందా? ఇక అప్పటినుంచి కడుపులో చెట్టు మొలుస్తుందో.. లేక అపెండిసైటిస్ లాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడుతున్నారా? అసలు నిమ్మ గింజ కడుపులోకి వెళ్లాక లోపల ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలేంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలామంది వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగడం, నిమ్మకాయ చారు లేదా రకరకాల కషాయాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. అయితే ఆ సమయంలో అనుకోకుండా ఒకటి లేదా రెండు నిమ్మ గింజలు గొంతులోకి జారి కడుపులోకి వెళ్లిపోతుంటాయి. అలా గింజ మింగిన వెంటనే చాలామంది తీవ్ర ఆందోళనకు గురవుతారు. గింజ కడుపులో ఇరుక్కుపోయి అపెండిసైటిస్ వస్తుందా? లేదా ఆపిల్ గింజల్లా ఇవి శరీరంలో విషంగా మారతాయా? అన్న భయాలు తలెత్తుతుంటాయి. పొరపాటున నిమ్మ గింజలు కడుపులోకి వెళితే శరీరం లోపల ఏం జరుగుతుందో శాస్త్రీయ నిజాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
నిమ్మ గింజలు విషపూరితమా?
ఆపిల్, చెర్రీ వంటి పండ్ల గింజల్లో స్వల్ప మోతాదులో సైనైడ్ రసాయన సమ్మేళనాలు ఉంటాయి కాబట్టి వైద్యులు వాటి విషయంలో హెచ్చరిస్తుంటారు. కానీ నిమ్మ గింజలలో అలాంటి విషపూరిత పదార్థాలేవీ ఉండవని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కాబట్టి నిమ్మ గింజ మింగితే విషప్రయోగం జరుగుతుందన్న ఆలోచన పూర్తిగా అవాస్తవం.
కడుపులోకి వెళ్లాక ఏం జరుగుతుంది?
జీర్ణం కాని సెల్యులోజ్ పొర నిమ్మ గింజల బయటి పొర అత్యంత గట్టిదైన సెల్యులోజ్ ఫైబర్‌తో తయారవుతుంది. ఆహారాన్ని కరిగించే శక్తివంతమైన పొట్టలోని ఆమ్లాలు సైతం ఈ సెల్యులోజ్ పొరను కరిగించలేవు. ఈ ఆమ్లాల వల్ల గింజలకు ఎలాంటి నష్టం జరగదు.
సహజంగానే విసర్జన
కడుపులో ఈ గింజలు జీర్ణం కాకపోయినా, పేగు గోడలకు ఎక్కడా అంటుకోవు. మిగిలిన ఆహారంతో కలిసి అవి సహజంగా జీర్ణకోశం గుండా ప్రయాణించి, మలం ద్వారా బయటకు విసర్జించబడతాయి. కాబట్టి ఇవి కడుపులో ఇరుక్కుపోయి అపెండిసైటిస్ తెచ్చిపెడతాయన్న భయానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
ఏ సందర్భంలో ప్రమాదం?
ఎక్కువ సంఖ్యలో మింగితే: పొరపాటున ఒకటి లేదా రెండు గింజలు వెళితే శరీరానికి ఎటువంటి హాని ఉండదు. కానీ ఒకేసారి పెద్ద సంఖ్యలో గింజలను మింగేస్తే మాత్రం జీర్ణం కాక కడుపుబ్బరం, అజీర్ణం లేదా తేలికపాటి కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
పిల్లల విషయంలో హెచ్చరిక: పెద్దల కంటే చిన్నపిల్లల విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిమ్మ గింజలు పిల్లల శ్వాసనాళంలో ఇరుక్కునే ప్రమాదం ఎక్కువ. అది ప్రాణాంతకంగా మారుతుంది కాబట్టి వర్షాకాలంలో పిల్లలకు నిమ్మరసం లేదా పానీయాలు ఇచ్చేటప్పుడు గింజలు రాకుండా వడకట్టి ఇవ్వడం ఉత్తమం.
నిమ్మరసం, వేడి కషాయాలు తాగేటప్పుడు అనుకోకుండా ఒకటి లేదా రెండు నిమ్మ గింజలు కడుపులోకి వెళ్లినా ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు; శరీరం సహజ ప్రక్రియ ద్వారానే వాటిని బయటకు పంపించేస్తుంది.
