UPI ట్రాన్‌జాక్షన్లపై ఛార్జీలు వస్తాయా?.. క్లారిటీ ఇచ్చిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
యూపీఐ (UPI) వినియోగదారులు, చిన్న వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు విధించడం లేదని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. యూపీఐ సేవలు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని, ప్రస్తుతం జరుగుతున్న చర్చలు డిజిటల్ పేమెంట్ వ్యవస్థను దీర్ఘకాలికంగా బలోపేతం చేసే అంశాలకే సంబంధించినవని వెల్లడించింది.

దేశంలో యూపీఐ (UPI) లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారనే ప్రచారం నేపథ్యంలో పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) కీలక ప్రకటన చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని, అలాగే చిన్న దుకాణాలు, కిరాణా వ్యాపారులు యూపీఐ చెల్లింపులు స్వీకరించడానికి కూడా ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
PCI తెలిపిన వివరాల ప్రకారం, 2016లో ప్రారంభమైనప్పటి నుంచే యూపీఐ సేవలు వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఈ విధానం యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. చిన్న వ్యాపారులు కూడా ఎలాంటి అదనపు భారం లేకుండా యూపీఐ చెల్లింపులను స్వీకరించవచ్చని తెలిపింది.
అయితే ఇటీవల యూపీఐ ఛార్జీలపై చర్చ జరగడానికి కారణం.. యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ డిజిటల్ పేమెంట్ వ్యవస్థగా ఎదగడమేనని PCI పేర్కొంది. ప్రతి నెలా బిలియన్ల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థను మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా కొనసాగించేందుకు అవసరమైన మౌలిక వసతులు, సైబర్ భద్రత, మోసాల నివారణ, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలకు భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయని వివరించింది.
దాదాపు పదేళ్లుగా బ్యాంకులు, చెల్లింపు సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు, NPCI, RBI కలిసి యూపీఐ అభివృద్ధికి నిరంతరం పెట్టుబడులు పెడుతున్నాయని PCI తెలిపింది. 24 గంటలూ అంతరాయం లేకుండా సేవలు అందించేందుకు, వినియోగదారుల డేటా భద్రత, మోసాల నివారణ, సాంకేతిక నిర్వహణ కోసం ప్రతిరోజూ వ్యయాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
యూపీఐ ఉచితమైతే ఈ ఖర్చులను ఎవరు భరిస్తారనే ప్రశ్నకు స్పందించిన PCI.. ప్రస్తుతం బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర భాగస్వామ్య సంస్థలే ఈ వ్యయాలను భరిస్తున్నాయని తెలిపింది. దీంతో వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు లేకుండానే సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను కొనసాగించగలుగుతున్నారని వెల్లడించింది.
పెద్ద వ్యాపార సంస్థలకు భవిష్యత్తులో మర్చంట్ సర్వీస్ ఛార్జీలు వర్తించినా, దాని ప్రభావం వినియోగదారులపై ఉండదని PCI స్పష్టం చేసింది. అలాంటి ఛార్జీలు పూర్తిగా వ్యాపార సంస్థలు.. పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఉండే వాణిజ్య ఒప్పందాలేనని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపు వ్యవస్థల్లో ఇలాంటి విధానం సాధారణమేనని వివరించింది.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ జీవితంలో యూపీఐపై ఆధారపడుతున్న నేపథ్యంలో, ఈ డిజిటల్ చెల్లింపు వ్యవస్థను దీర్ఘకాలికంగా బలోపేతం చేయడం అత్యంత అవసరమని PCI పేర్కొంది. భవిష్యత్తులో కూడా యూపీఐ సురక్షితంగా, విశ్వసనీయంగా, అంతరాయం లేకుండా పనిచేయాలంటే మౌలిక వసతులు, సైబర్ భద్రత, ఆవిష్కరణలు, మోసాల నియంత్రణపై నిరంతర పెట్టుబడులు అవసరమని వెల్లడించింది.
There has been considerable discussion around UPI and merchant charges. Here are the facts behind the conversation what it means for consumers, merchants, and India’s digital payment ecosystem.
1. Will I have to pay to use UPI? No. UPI has always been free for consumers since…
— PCI – Payments Council of India (@PCIUpdates) August 7, 2026
