Gold Price: దేవుడా.. బంగారం అంత పెరుగుతుందా.. నోస్ట్రాడమస్ జోస్యంతో ప్రపంచం షాక్..
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇలాంటి అనిశ్చిత సమయాల్లో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా తగ్గుముఖం పట్టాయి. అటు నోస్ట్రాడమస్ ప్రవచనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే, ఇటు మార్కెట్ నిపుణులు మాత్రం భిన్నమైన విశ్లేషణలు చేస్తున్నారు.అసలు బంగారం ధరలు మళ్లీ ఎప్పుడు పుంజుకుంటాయి..?

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ మధ్య దాడులు తీవ్రతరమవ్వడం, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి నెట్టాయి. సాధారణంగా యుద్ధం ఉంటే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం మార్కెట్లో సీన్ రివర్స్ అవుతోంది. బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ అంచనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నోస్ట్రాడమస్ తన ప్రవచనాల్లో ఏడు నెలల యుద్ధం, రాత్రిపూట దాడుల గురించి ప్రస్తావించారు. వీటిని విశ్లేషకులు ఆధునిక డ్రోన్ దాడులకు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి సంకేతంగా భావిస్తున్నారు. యుద్ధం కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 2026 నాటికి తులం బంగారం ధర రూ.4.5 లక్షలకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇవి కేవలం ఊహాజనిత ప్రవచనాలు మాత్రమేనని, వీటికి మార్కెట్ నిర్ధారణ లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మార్కెట్లో ప్రస్తుత పరిస్థితి
యుద్ధం ఉన్నప్పటికీ, సురక్షితమైన ఆస్తులుగా భావించే బంగారం, వెండి ధరలు ప్రస్తుతం కొత్త లాభాలను అందుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. MCX మార్కెట్లో బంగారం ధర దాదాపు 1శాతం తగ్గి రూ.1,59,400 కనిష్ట స్థాయికి చేరింది. ఏప్రిల్ 2026 నాటి రికార్డు గరిష్టం నుండి చూస్తే దాదాపు 18శాతం తగ్గింది. కిలో వెండి ధర రూ.2.60 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇది 2026 ఆరంభంలో ఉన్న గరిష్ట స్థాయి నుండి 41శాతం పడిపోవడం గమనార్హం. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 5,100 డాలర్ల కంటే తక్కువకు, వెండి 84 డాలర్ల కంటే తక్కువకు పడిపోయాయి. అమెరికా డాలర్ బలోపేతం కావడమే దీనికి ప్రధాన కారణం.
ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
యుద్ధ సమయంలో బంగారం పెరగాలి, కానీ అమెరికాలో ద్రవ్యోల్బణ భయాల వల్ల ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. దీనివల్ల డాలర్ విలువ పెరిగి, పెట్టుబడిదారులు బంగారం వైపు కాకుండా డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. రిద్దిసిద్ధి బులియన్స్, ఎన్రిచ్ మనీ నిపుణుల ప్రకారం.. దీర్ఘకాలంలో బంగారం, వెండి ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. బంగారం 5,000 డాలర్ల వద్ద బలమైన సపోర్ట్ ఉంది. ఒకవేళ 5,400 – 5,600 డాలర్ల స్థాయిని దాటితే మళ్లీ కొత్త రికార్డులను సృష్టించవచ్చు. ఇక వెండి వెండి 90-95 డాలర్ల పైన స్థిరంగా కొనసాగితే, మళ్లీ 110 డాలర్ల మార్కును తాకే అవకాశం ఉంది.
యుద్ధ వాతావరణం, భౌగోళిక అనిశ్చితి ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత తగ్గుదల కేవలం తాత్కాలికమేనని దీర్ఘకాలికంగా బంగారం తన విలువను నిలుపుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నోస్ట్రాడమస్ చెప్పినట్లు లక్షల రూపాయల ధర పెరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి..
