Suryakumar Yadav : వరల్డ్ కప్ గెలిచాం.. ఇక ఒలింపిక్స్ గోల్డే మా టార్గెట్.. కెప్టెన్ సూర్య సంచలన ప్రకటన
Suryakumar Yadav : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం (మార్చి 8) టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో మట్టికరిపించి, భారత్ మూడోసారి టీ20 ప్రపంచ విజేతగా నిలిచింది. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ రికార్డుల్లోకెక్కాడు.

Suryakumar Yadav : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం (మార్చి 8) టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో మట్టికరిపించి, భారత్ మూడోసారి టీ20 ప్రపంచ విజేతగా నిలిచింది. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ రికార్డుల్లోకెక్కాడు. అయితే, ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో మునిగిపోకుండా, స్కై తన తదుపరి లక్ష్యాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీమిండియా తదుపరి గురి ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమేనని సూర్య స్పష్టం చేశాడు.
వరల్డ్ కప్ గెలిచిన అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ విజయం చాలా ప్రత్యేకం కానీ ఇక్కడితో ఆగిపోమని చెప్పాడు. “మా ముందు పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి వస్తోంది. అక్కడ గోల్డ్ మెడల్ గెలవడమే మా తదుపరి మిషన్. అదే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌ను కూడా ముద్దాడాలని ఉంది” అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. 1900 ఒలింపిక్స్ తర్వాత దాదాపు 128 ఏళ్లకు క్రికెట్ మళ్ళీ ఒలింపిక్ వేదికపైకి రాబోతుండటంతో, భారత్ అక్కడ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది.
ఒకప్పుడు ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏళ్లు నిరీక్షించిన భారత జట్టు, ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. 2024లో రోహిత్ శర్మ కౌశల్యంతో టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్, 2025లో న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పుడు 2026లో సూర్య నాయకత్వంలో మళ్ళీ టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఇలా కేవలం మూడేళ్ల వ్యవధిలోనే మూడు ఐసీసీ ట్రోఫీలను గెలిచి ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా అవతరించింది. టీమిండియా అనుసరిస్తున్న అగ్రెసివ్ అప్రోచ్ ఈ విజయాలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
సూర్య సేన ఇప్పుడు వరుస విజయాల జోరులో ఉంది. వచ్చే ఏడాది(2027)లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్ కప్‌పై భారత్ కన్నేసింది. ఒకవేళ ఆ ట్రోఫీని కూడా గెలిస్తే, క్రికెట్ చరిత్రలో భారత్ ఒక అజేయమైన శకంగా నిలిచిపోతుంది. రోహిత్ పెట్టిన పునాదిని సూర్య పటిష్టం చేస్తూ, యువ ఆటగాళ్లతో జట్టును ఒలింపిక్ గోల్డ్ వైపు నడిపిస్తున్న తీరు చూస్తుంటే.. భారత్ క్రీడా ప్రపంచంలో మరో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
