గ్యాస్, ఏటీఎమ్ కార్డు ఉన్నవాళ్లకు అలర్ట్.. ఏప్రిల్ 1 కొత్త రూల్స్.. ఇవి తప్పక తెలుసుకోండి..
కొత్త ఆర్థిక ఏడాదిలో సామాన్యుడి ఆర్థిక లెక్కలు కూడా తలకిందులు కానున్నాయి. అటు ఆదాయపు పన్నులో భారీ ఊరట లభిస్తుందని సంబరపడాలో.. ఇటు ఏటీఎం విత్‌డ్రాయల్స్, గ్యాస్ ధరలు, రైల్వే నిబంధనలు భారమవుతున్నాయని ఆందోళన చెందాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అసలు ఏప్రిల్ 1 నుంచి మీ జేబుపై పడే భారాల గురించి తెలుసుకుందాం..

కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మన దైనందిన జీవితంపై ప్రభావం చూపే కీలక నిబంధనల్లో భారీ మార్పులు రానున్నాయి. బ్యాంకింగ్ నుంచి ఆదాయపు పన్ను వరకు, గ్యాస్ సిలిండర్ ధరల నుండి రైల్వే టిక్కెట్ల వరకు రాబోతున్న ఈ మార్పులు మీ ఆర్థిక ప్రణాళికలను తలకిందులు చేయవచ్చు.
పన్ను విధానంలో విప్లవాత్మక మార్పులు
కొత్త ఆర్థిక సంవత్సరం నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. ఇది పాత నిబంధనలను మరింత సరళతరం చేయనుంది. మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటనిస్తూ.. రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభించనుంది. సెక్షన్ 87A కింద ఈ వెసులుబాటు కల్పించారు. ఇకపై ఫారం 16, 16A స్థానంలో ఫారం 130, 131 అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం మరింత సులభతరం కానుంది. ఇకపై అసెస్మెంట్ ఇయర్ అనే పదం వినిపించదు, దాని స్థానంలో నేరుగా పన్ను సంవత్సరం అని పిలుస్తారు.
పాన్ కార్డు నిబంధనలు కఠినం
ఇప్పటివరకు పాన్ కార్డు కోసం ఆధార్ ఉంటే సరిపోయేది. కానీ ఏప్రిల్ 1 నుండి పుట్టిన తేదీ ధృవీకరణ కోసం ఖచ్చితంగా 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. కేవలం ఆధార్‌తో పాన్ పొందే రోజులు చెల్లిపోయాయి.
ఏటీఎం లావాదేవీలు భారం
బ్యాంకు లావాదేవీలు ఇకపై ఖరీదు కానున్నాయి. ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి విత్‌డ్రాయల్‌కు రూ.23 ఛార్జీలు వసూలు చేస్తారు. ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే దానికి కూడా రూ.25 వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంది. అంతేకాకుండా డెబిట్ కార్డు నగదు ఉపసంహరణ పరిమితిని 1 లక్ష నుండి రూ.50,000 – రూ.75,000కు బ్యాంకులు తగ్గించనున్నాయి.
గ్యాస్, ఇంధన ధరల సెగ
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం గ్యాస్ ధరలపై పడనుంది. ఏప్రిల్ 1న ఎల్‌పిజి, సిఎన్జీ ధరలను సవరించే అవకాశం ఉంది. ఇది రవాణా ఖర్చులను పెంచి, పరోక్షంగా నిత్యావసర ధరల పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉంది.
రైల్వే టిక్కెట్ క్యాన్సిలేషన్.. ఇక అంత సులభం కాదు
రైల్వే ప్రయాణికులకు ఇది చేదు వార్త. టిక్కెట్ రద్దు నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు రద్దు చేస్తే ఒక్క రూపాయి కూడా వాపసు రాదు. 8 నుండి 24 గంటల మధ్య రద్దు చేస్తే 50శాతం, 72 గంటల కంటే ముందు రద్దు చేస్తే నిర్ణీత కోతలతో రీఫండ్ లభిస్తుంది.
ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ మార్పులు కొన్ని వర్గాలకు ఊరటనిస్తే, మరికొన్ని సామాన్యుడిపై ఆర్థిక భారాన్ని మోపనున్నాయి. కాబట్టి, మీ ఆర్థిక లావాదేవీలను ఈ నెలాఖరులోపే చక్కదిద్దుకోవడం ఉత్తమం.
