Rupee Affects: రూపాయి విలువ పడిపోతే ఏం జరుగుతుందో తెలిస్తే షాకవుతారు.. వేటి దరలు పెరగనున్నాయంటే..
Rupee vs Dollar: పతనం కొనసాగుతోంది. రూపాయి విలువ దిగజారుతోంది. డాలర్‌తో పోల్చితే.. రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతుండడం సామాన్యుడిలో తెగ టెన్షన్ పెడుతోంది.
అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రోజురోజుకీ దిగజారుతోంది. ఈ మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ.80కి పడిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు ఇండియన్ స్టాక్‌లలో(Indian Stocks) అమ్మకాలు(Sales) కొనసాగించడం.. ముడి చమురు ధరలు, దేశీయ ద్రవ్యోల్బణం(Inflation) పెరగడం వంటివి రూపాయి పతనానికి కారణంగా మారుతున్నాయి. వడ్డీ రేట్లలో మార్పుల కారణంగా ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. ఇది ఇండియన్ కరెన్సీ(Indian Currency) విలువను మరింత దిగజార్చవచ్చు.
ఒక డాలర్ విలువ చేసే వస్తువులకు 2017లో రూ.64 చెల్లిస్తే ఇప్పుడు రూ.77.62 చెల్లించాల్సి వస్తోంది. 2017తో పోలిస్తే రూపాయి విలువ ఏటా 3.75 శాతం చొప్పున పడిపోతోంది. రూపాయి క్షీణత వల్ల మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలకు ఇది మరింత బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.
ఇంపోర్టెడ్ వస్తువుల ధరలు మరింత పై పైకి..
రూపాయి ఎంత చిక్కితే.. మనం దిగుమతి చేసుకునే వస్తువులపై మరింత ప్రభావం పడుతుంది. మనం చెల్లించాల్సి డబ్బులు పెరుగుతూ ఉంటాయి. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎల్.ఈ.డి టి.విలు, డిజిటల్ కెమేరాలు, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో వాడే సర్క్యూట్ బోర్డులు దిగుమతి చేసుకుంటున్నందున.. వాటన్నింటి ధరలపై రూపాయి క్షీణత ప్రభావం ఉంటుంది. దిగుమతి చేసుకునే విలాసవంత కార్లు, బైక్‌లతో పాటు కార్ల విడిభాగాలు మరింత పెరగవచ్చు.
నిత్యావసరాలకు రెక్కలు..
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలకు రెక్కలు వస్తుంటాయి. దీని వల్ల రవాణా ఖర్చులు ఇబ్బడి.. ముబ్బడిగా పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగిపోయి.. కూరగాయలు, ఇతర వస్తువుల ధరలూ పెరుగుతాయి. ఫలితంగా కూరగాయల వంటి నిత్యావసరాల ధరలు కూడా ఎగబాకుతాయి. తయారీలో ముడి చమురును వినియోగించుకునే సబ్బులు, కాస్మొటిక్స్, పెయింట్స్ వంటి ఉత్పత్తులపై పడే భారాన్ని కంపెనీలు వినియోగదారులకు మళ్లిస్తాయి. ఫలితంగా ఆయా ఉత్పత్తులు ఖరీదవుతాయి. ఇలా ధరలన్నీ పెరిగి ద్రవ్యోల్బణం తెరపైకి వస్తుంది.
విదేశీ ప్రయాణం, విద్య ..
రూపాయి పతనంతో విదేశీ ప్రయాణం, విద్య ఖరీదు అవుతుంది. ఎందుకంటే ప్రతి డాలర్ మార్పిడికి ఒక వ్యక్తి ఎక్కువ రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. అంటే చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు లేదా ఎవరైనా విదేశీ పర్యటనకు వెళ్లే వారు ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రుణాలు ఖరీదైనవి..
ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసే ముందు త్వరగా పని చేసేందుకు ఆర్‌బిఐ ఇటీవల రెపో రేటును మార్చింది. సెంట్రల్ బ్యాంక్ తన రాబోయే పాలసీ సమీక్ష సమావేశంలో కీలక రేటును మరింత పెంచే అవకాశం ఉంది. దీని ఫలితంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ రేట్లను పెంచుతాయి. అంటే ప్రజలు తమ రుణాలపై ఎక్కువ EMIలు చెల్లించవలసి ఉంటుంది.
విదేశీ పెట్టుబడిదారులు
స్టాక్ ధరలతో రూపాయి కదలికకు చాలా ఎక్కువ సంబంధం ఉంది. రూపాయి పతనమైనప్పుడు అది విదేశీ పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోపై కూడా ప్రభావం చూపుతుంది. వారి కొనుగోలు, అమ్మకాలు నేరుగా దేశీయ స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి. రూపాయి విలువ తగ్గినప్పుడు.. వారు ఈక్విటీ మార్కెట్ల నుండి వైదొలగడం ప్రారంభిస్తారు. ఇది పెద్ద పతనానికి దారి తీస్తుంది. దీని ఫలితంగా కంపెనీల స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్ వంటి ఇతర ఈక్విటీ సంబంధిత పెట్టుబడుల విలువ తగ్గుతుంది.
కరెన్సీ విలువ హెచ్చుతగ్గులకు గురైనప్పుడు వారి హోల్డింగ్‌లు గణనీయంగా ప్రభావితమవుతాయని విదేశీ ఇన్వెస్టర్లు రూపాయి కదలికను నిశితంగా గమనిస్తున్నారని ఆర్ధిక విశ్లేషకులు అంటున్నారు.