పెట్రోల్, డీజిల్ పంపిణీకి కొత్త రూల్స్..! అందరికీ లిమిట్ ప్రకారం అమ్మకం
కేరళంలో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కొత్త పరిమితులు అమలవుతున్నాయి. వినియోగదారుడు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్, రూ.5,000 విలువైన పెట్రోల్‌ను కొనుగోలు చేయగలడు. ఇది ఇంధన కొరత కాదని, అధిక డిమాండ్ సమయంలో స్టాక్ నిండుకోకుండా చూసేందుకు, సాధారణ వినియోగదారులకు నిరంతరాయంగా ఇంధనం అందుబాటులో ఉంచేందుకు తీసుకున్న జాగ్రత్త చర్యలేనని ఆపరేటర్లు, పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి.

కేరళంలో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కొత్త పరిమితులు అమల్లోకి వచ్చాయన్న వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మీడియా నివేదికల ప్రకారం రాష్ట్రంలోని పలు ఇంధన విక్రయ కేంద్రాలు బల్క్ కొనుగోళ్లపై తాత్కాలిక నియంత్రణలు విధిస్తున్నాయి. ఈ చర్యల ప్రకారం ఒక వినియోగదారుడు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే కొనుగోలు చేయగలడు. అలాగే పెట్రోల్ కొనుగోలు పరిమితిని సుమారు రూ.5,000 వరకు నిర్దేశించినట్లు సమాచారం. మలయాళ మీడియా సంస్థ మాతృభూమి నివేదికల ప్రకారం రిటైల్ అవుట్‌లెట్లలో ఇంధనం నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడటం, అధిక డిమాండ్ సమయంలో స్టాక్ అకస్మాత్తుగా ఖాళీ కాకుండా నివారించడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం దీర్ఘకాలిక నిల్వల కంటే, రోజువారీ లేదా స్వల్పకాలిక డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పంపులకు ఇంధనం సరఫరా చేస్తున్నాయని తెలుస్తోంది. దీంతో చాలా పెట్రోల్ బంకులు ఒకేసారి కొన్ని రోజులకు సరిపడా స్టాక్‌తోనే కొనసాగుతున్నాయని సమాచారం. కేరళంలో సుమారు 2,500 పెట్రోల్ పంపులు ఉండగా, వీటిలో చాలా వరకు 12,000 నుంచి 24,000 లీటర్ల ట్యాంకర్ల ద్వారా క్రమబద్ధమైన సరఫరాలపై ఆధారపడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని పెద్ద బంకులు రోజుకు 10,000 లీటర్లకు పైగా డీజిల్ విక్రయిస్తుండగా, చిన్న అవుట్‌లెట్లలో అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బల్క్ కొనుగోళ్లు పెరిగితే సాధారణ వినియోగదారులకు ఇంధనం అందుబాటులో లేకపోయే ప్రమాదం ఉందని ఆపరేటర్లు చెబుతున్నారు.
అయితే దేశవ్యాప్తంగా ఎలాంటి అధికారిక ఇంధన కొరత లేదని పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి. లాజిస్టిక్స్ ఆలస్యం లేదా రవాణా సమస్యల వల్ల కొన్నిచోట్ల తాత్కాలిక అంతరాయాలు ఏర్పడవచ్చని మాత్రమే పేర్కొంటున్నారు. కేరళ రాష్ట్ర పెట్రోలియం వ్యాపారుల సంఘం ప్రతినిధులు కూడా ఈ పరిమితులు కొరత సంకేతం కాదని, సరఫరా సమతుల్యత కోసం తీసుకున్న జాగ్రత్త చర్యలేనని వివరించారు. ఇక ధరల విషయానికి వస్తే తిరువనంతపురంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107.48గా ఉండగా, డీజిల్ ధర రూ.96.48గా ఉంది. ఇదే సమయంలో చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.80, డీజిల్ ధర రూ.92.39గా నమోదైంది. దక్షిణ భారతదేశంలోనే కేరళంలో ఇంధన ధరలు అత్యధిక స్థాయిలో కొనసాగుతున్నాయని ఐఓసీఎల్ డేటా సూచిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
