Virat Kohli : హిస్టరీ క్రియేట్ చేసిన విరాట్.. ధోనీ, రోహిత్‌లను దాటేసిన కింగ్ కోహ్లీ
Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన పేరిట మరో అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం రాయ్‌పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా విరాట్ ఈ ఘనత సాధించాడు.

Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన పేరిట మరో అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం రాయ్‌పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా విరాట్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ పేరిట ఉండగా.. ఇప్పుడు వారందరినీ వెనక్కి నెట్టి కోహ్లీ టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు.
ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఎంఎస్ ధోనీ (278 మ్యాచ్‌లు), రోహిత్ శర్మ (278 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ 279వ సారి ఐపీఎల్ బరిలోకి దిగి వారిద్దరినీ అధిగమించాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కోహ్లీ తన కెరీర్ ప్రారంభం (2008) నుంచి ఇప్పటివరకు ఒకే ఒక్క ఫ్రాంచైజీ (ఆర్‌సీబీ) తరపున ఆడుతూ ఈ రికార్డు అందుకోవడం విశేషం. ధోనీ, రోహిత్ వంటి దిగ్గజాలు ఒకటి కంటే ఎక్కువ జట్లకు ప్రాతినిధ్యం వహించగా, కోహ్లీ మాత్రం ఆర్‌సీబీకి లాయల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కేవలం మ్యాచ్‌ల సంఖ్యలోనే కాదు, పరుగుల పరంగా కూడా కోహ్లీకి సాటి ఎవరూ లేరు. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు మార్కును దాటిన ఏకైక ఆటగాడు విరాట్. ఇప్పటివరకు ఆడిన 279 మ్యాచుల్లో కోహ్లీ మొత్తం 9,040 పరుగులు చేశాడు. ఇందులో అత్యధికంగా 8 సెంచరీలు ఉండటం గమనార్హం. ఐపీఎల్ ఆరంభం నుంచి నేటి వరకు అంటే దాదాపు 19 సీజన్లుగా ఏకధాటిగా ఆడుతున్న ముగ్గురు ప్లేయర్లలో (కోహ్లీ, రోహిత్, మనీష్ పాండే) విరాట్ ఒకడు.
ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో కోహ్లీ ఆర్‌సీబీ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. సీజన్ ఆరంభంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్, గత రెండు మ్యాచుల్లో వరుసగా సున్నాకే అవుట్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. అయినప్పటికీ, ఈ సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన కోహ్లీ 379 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 163 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరపున అన్ని సీజన్లు ఆడిన రికార్డు కూడా కోహ్లీ పేరు మీదనే ఉంది. 2008లో కుర్రాడిగా ఆర్‌సీబీలో చేరిన విరాట్, ఇప్పుడు ఆ జట్టుకు ఐకాన్‌గా మారాడు. రోహిత్ శర్మ గతంలో డెక్కన్ చార్జర్స్ తరపున, ధోనీ రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ తరపున ఆడిన చరిత్ర ఉంది. కానీ కోహ్లీ మాత్రం బెంగళూరు జెండాను ఒక్కడే మోస్తున్నాడు. ప్లే ఆఫ్స్ ముంగిట ఉన్న ఆర్‌సీబీకి కోహ్లీ అనుభవం ఇప్పుడు కొండంత అండగా మారనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
