SCSS Scheme: సీనియర్ సిటిజెన్లకు గుడ్ న్యూస్.. ఆ పథకంలో వడ్డీ రేటు పెరిగింది.. ప్రయోజనాలు ఎలా పొందాలంటే..
సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్)లో పెట్టుబడులు పరిమితిని ప్రభుత్వం పెంచింది. అలాగే వడ్డీ రేటును సవరించింది. గతేడాదితో పోల్చితే ప్రస్తుత వడ్డీ రేటు అధికంగా ఉంది. ఒకవేళ ఏడాది కిందట ఈ పథకాన్ని ప్రారంభిస్తే అటువంటి వారు ఈ ఏడాది పెరిగిన వడ్డీ రేటును పొందలేరు. మరేం చేయాలి?
వయో వృద్ధులకు స్థిరమైన రాబడితో పాటు అధిక వడ్డీని అందించే పథకం సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్). ఇటీవలే దీనిలో పెట్టుబడులు పరిమితిని ప్రభుత్వం పెంచింది. అలాగే వడ్డీ రేటును సవరించింది. గతేడాదితో పోల్చితే ప్రస్తుత వడ్డీ రేటు అధికంగా ఉంది. ఒకవేళ ఏడాది కిందట ఈ పథకాన్ని ప్రారంభిస్తే అటువంటి వారు ఈ ఏడాది పెరిగిన వడ్డీ రేటును పొందలేరు. మరేం చేయాలి? వడ్డీ కోల్పోకుండా ఉండటానికి ఉన్న ఏకైక అవకాశం.. గతేడాది ప్రారంభించిన ఎస్‌సీఎస్‌ఎస్ ఖాతాను ప్రీ మెచ్యూర్‌గా క్లోజ్ చేసి, మరోసారి కొత్తగా ఖాతాను ప్రారంభించడమే! అయితే ఇది సాధ్యమేనా? దీని వల్ల బ్యాంకు పెనాల్టీలు వేస్తాయా? వేస్తే ఎంత వేస్తాయి? అప్పటి వరకూ వచ్చిన వడ్డీని ఇస్తాయా? అసలు ఇలా ప్రీ మెచ్యూర్ విత్ డ్రాల్ చేసి.. మరొ కొత్త ఖాతా ప్రారంభించడం మంచిదేనా? చూద్దాం రండి..
ఈ ఉదాహరణ చూడండి..
ఒక సీనియర్ సిటిజన్ 2022 జనవరిలో 7.4% వడ్డీ రేటుతో సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్‌లో రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి. ఖాతా తెరిచినప్పటి నుంచి త్రైమాసిక వడ్డీ రూ.27,750 పొందుతున్న ఆయన.. ఇప్పటివరకు రూ.1,38,750 (రూ. 27,750×5) వడ్డీగా పొందాడు. అయితే ఇప్పుడు అదే స్కీమ్ పై వడ్డీ రేటును ప్రభుత్వం 8.2%కి పెంచింది. ఇప్పుడు ఆ పెద్దాయన పాత తక్కువ వడ్డీ ఉన్న ఖాతాను మూసివేసి.. ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి కొత్త ఖాతాను ప్రారంభించాలనుకుంటున్నాడు. అయితే ఆ ఖాతాను మూసివేస్తే, ఆయన పెట్టుబడి పెట్టిన మొత్తంలో 1.5% అంటే రూ. 22,500 ప్రీమెచ్యూర్ క్లోజర్ పెనాల్టీగా బ్యాంకు విధిస్తుంది. ఖాతా ప్రారంభించి ఏడాది దాటింది కాబట్టి ఇది ఉంటుంది.
ఒక సంవత్సరం అయితే ఫర్వాలేదు..
సీనియర్ సిటిజన్ ఖాతా ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తి అయితే.. ఈ ఖాతాలో ప్రీ మెచ్యూర్ క్లోజర్‌కి 1.50% మాత్రమే ఉంటుంది. అందువల్ల తక్కువ వడ్డీ వచ్చే పాత ఖాతాను ముగించి, కొత్త వడ్డీ ప్రకారం కొత్త ఖాతాను ప్రారంభించడం లాభలాటిగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకుకు కట్టే పెనాల్టీ మొత్తాన్ని కూడా కొత్త వడ్డీ రేటు ప్రకారం కేవలం రెండేళ్లలోనే తిరిగి సంపాదించవచ్చని చెబుతున్నారు.
పన్ను ప్రయోజనం సంగతేంటి..
ఎస్‌సీఎస్‌ఎస్ ఖాతాలో రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్‌లు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపునకు అర్హత పొందుతాయి. సీనియర్ సిటిజన్ ఇప్పటికే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసి ఉంటే, ఆ వ్యక్తి పాత ఖాతాలో రూ. 1.5 లక్షలను వదిలివేసి, విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పుడు పన్ను మినహాయిపును కూడా పొందే వీలుంటుంది.
2020 నుంచి వడ్డీ రేటు ఇలా..
సెప్టెంబర్ 2020 నుంచి డిసెంబర్ 2022 మధ్య సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా వడ్డీ రేటు 7.4%గా ఉండేది. ఇది 01-10-2022 నుంచి 31-03-2023 మధ్య 8%కి చేరింది. ప్రస్తుత త్రైమాసికంలో (ఏప్రిల్-మార్చి 2023), దీని వడ్డీ రేటు 8.2%గా నిర్ణయించారు.
ప్రీమెచ్యూర్ క్లోజర్ పెనాల్టీ..
నిబంధనల ప్రకారం, 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధికి ముందు ఎప్పుడైనా ఖాతాను మూసివేయవచ్చు. కానీ అకాల మూసివేత కోసం కొన్ని జరిమానాలు చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకి,
- మీరు ఖాతాను తెరిచిన తేదీ నుంచి 1 సంవత్సరం పూర్తి కాకుండానే ఖాతాను మూసివేస్తే, దానిపై ఎటువంటి వడ్డీని బ్యాంకు చెల్లించదు. అప్పటికే ఒకవేళ వడ్డీ మీకు చెల్లించి ఉంటే దానిని కూడా వెనక్కి తీసుకుంటారు.
- మీరు ఖాతాను ప్రారంభించిన ఏడాది నుంచి రెండేళ్ల లోపు మూసివేస్తే.. మీ ఖాతాలో పొదుపు చేసిన మొత్తంపై 1.5 % పెనాల్టీగా విధిస్తారు.
- మీరు ఖాతాని రెండేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య మూసివేస్తే ప్రిన్సిపాల్ అమౌంట్లో 1% పెనాల్టీ పడుతుంది.
- ఖాతా 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయితే, దానిని మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. పొడిగించిన ఖాతాను ఎటువంటి మినహాయింపు లేకుండా ఖాతా పొడిగింపు తేదీ నుండి ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత మూసివేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..