AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold ETFs: గోల్డ్ ఈటీఎఫ్‌లకు పెట్టుబడుల వరద.. ఏడాదిలో ఎంత పెరిగాయో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ బంగారం కొనడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఆందోళనల నేపథ్యంలో ఇదే సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు. దీంతో బంగారం ధర రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. ఇక భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండగలు, శుభకార్యాలు జరిగినప్పుడు బంగారు ఆభరణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

Gold ETFs: గోల్డ్ ఈటీఎఫ్‌లకు పెట్టుబడుల వరద.. ఏడాదిలో ఎంత పెరిగాయో తెలుసా..?
Gold Etfs
Nikhil
|

Updated on: Apr 03, 2025 | 4:45 PM

Share

కేవలం అందం కోసమే కాదు భవిష్యత్తు అవసరాల కోసం బంగారం కొనుగోలు చేసేవారు ఇటీవల ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. 2024 ఫిబ్రవరిలో రూ.28,529.88 కోట్లుగా ఉన్న గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ నికర ఆస్తుల ఈ ఏడాది ఫిబ్రవరికి దాదాపు రెట్టింపు అయ్యి రూ.55,677.24 కోట్లకు చేరుకున్నాయి. సాధారణంగా బంగారాన్ని రెండు రకాల పద్ధతుల్లో కొనుగోలు చేస్తారు. సమీపంలోని బంగారు దుకాణానికి వెళ్లి, నచ్చిన ఆభరణాన్నిఎంపిక చేసుకుని, ఆ రోజు ధర ప్రకారం డబ్బులు చెల్లిస్తారు. ఈ విధానంలో మీ దగ్గర భౌతికంగా బంగారం ఉంటుంది. రెండో పద్దతిలో గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. అంటే ఎలక్ట్రానిక్ విధానంలో బంగారం కొనుగోలు చేయడం. డీమ్యాట్ ఖాతా ద్వారా యూనిట్ల రూపంలో బంగారం కొనవచ్చు. ఈ విధానంలో మీవద్ద భౌతికంగా బంగారం ఉండదు. మీరు మొబైల్ ఫోన్ ను ఉపయోగించి కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. ప్రస్తుతం వీటిలో పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి.

భౌతిక బంగారం, గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడుల మధ్య కొన్ని తేడాలు ఉంటాయి. భౌతికంగా మన చేతిలో బంగారం లేకపోవడం మినహా గోల్డ్ ఈటీఎఫ్ లలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భౌతికంగా బంగారం ఉంటే దాన్ని ఇంటిలో సురక్షితంగా దాచుకోవాలి. లేకపోతే బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. కానీ గోల్ట్ ఈటీఎఫ్ ఫండ్స్ లో బంగారం యూనిట్ల రూపంలో ఉంటుంది. దాన్ని ఎవరైనా దొంగిలిస్తారనే భయం ఉండదు. భౌతికంగా బంగారం కొనడానికి దుకాణానికి వెళ్లాలి. కానీ గోల్డ్ ఈటీఎఫ్ లావాదేవీలను ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. దుకాణాల్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు వాటికి తరుగు, మజూరు చార్జీలు వసూలు చేస్తారు. బంగారం ధరకు ఇవి అదనంగా ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ లలో మీరు పెట్టుబడికి సరిపడే బంగారం యూనిట్లు మీ ఖాతాలో జమఅవుతాయి.

దుకాణాల్లో బంగారు వస్తువు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.20 వేలు కావాలి. అయితే గోల్డ్ ఈటీఎఫ్ లలో రూ.75 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. భౌతిక బంగారాన్ని విక్రయించడం కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ఈటీఎఫ్ లను ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. ప్రజలకు అత్యధిక రాబడిని ఇచ్చే గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ లో క్వాంటం గోల్డ్ ఫండ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రెడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్, ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ ప్రముఖంగా ఉన్నాయి. వీటిలో పెట్టుబడులకు గణనీయమైన రాబడి వస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి