Taxi Service: డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం నుంచి ఓలా-ఉబర్ లాంటి ట్యాక్సీ సర్వీసులు!
Taxi Service: భారత ప్రభుత్వం క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యక్ష ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో 'సహకార్ టాక్సీ' (Sahakar Taxi) అనే సహకార ఆధారిత రైడ్-హెయిలింగ్ సేవను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు. ఓలా, ఉబర్ వంటి ప్రస్తుత రైడ్-హెయిలింగ్ సేవల మాదిరిగా కాకుండా, సహకార్ టాక్సీని సహకార సంఘాలు నిర్వహిస్తాయి..

Taxi Service: భారతదేశంలో క్యాబ్ సేవల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఓలా-ఉబర్ వంటి టాక్సీ సర్వీస్ కంపెనీలు ఈ రంగంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ‘సహకార్ టాక్సీ’ (Sahakar Taxi) అనే సహకార ఆధారిత రైడ్-హెయిలింగ్ సేవను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించారు. ఈ ప్రభుత్వ క్యాబ్ సర్వీస్ లక్ష్యం డ్రైవర్లకు ఎక్కువ లాభాలను అందించడం, వినియోగదారులకు సరసమైన సేవలను అందించడం.
ప్రభుత్వ టాక్సీ సర్వీస్ ఎలా ఉంటుంది?
ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సహకార-నిర్వహణ టాక్సీ సేవ ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ సంస్థలకు గట్టి పోటీనిచ్చేలా రూపొందించారు. ఈ సేవ ప్రధాన లక్ష్యం డ్రైవర్లకు మరిన్ని ప్రయోజనాలు, సాధికారత అందించడం. ప్రస్తుతం క్యాబ్ అగ్రిగేటర్లు డ్రైవర్ల నుండి భారీ కమీషన్లు వసూలు చేస్తున్నారు. ఇది వారి ఆదాయాన్ని పరిమితం చేస్తుంది. కానీ ఈ కొత్త మోడల్‌లో డ్రైవర్లు ప్రత్యక్ష లాభాలను పొందుతారు. ఏ ప్రైవేట్ కంపెనీకి పెద్ద మొత్తంలో కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు.
డ్రైవర్లు ప్రయోజనం పొందుతారు. ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుందని, ఈ క్యాబ్ సేవ వల్ల అతిపెద్ద లబ్ధిదారుడు టాక్సీ డ్రైవర్లేనని అమిత్ షా అన్నారు. అలాగే ఓలా, ఉబర్ వంటి ప్లాట్‌ఫామ్‌లు డ్రైవర్ల నుండి 20-30% వరకు కమీషన్ వసూలు చేస్తాయి. డ్రైవర్లు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ వంటి మరిన్ని సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందుతారు. అలాగే ప్రభుత్వ సహకార్ ట్యాక్సీలో భాగంగా లాభాలలో కొంత భాగం డ్రైవర్లకు వెళుతుంది. వారి ఆదాయం పెరుగుతుంది. ఓలా, ఉబర్ వంటి కంపెనీలు భారత మార్కెట్లో బలమైన పట్టును కలిగి ఉన్నాయి. కానీ అవి తరచుగా అనేక వివాదాలను ఎదుర్కొన్నాయి. పెరిగిన అద్దెలు, పెరిగిన ధరల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కొత్త క్యాబ్ సర్వీస్ రాక ఈ కంపెనీలకు పెద్ద సవాలుగా మారుతుంది. ఎందుకంటే ఈ సేవ చౌక ఛార్జీలు, ఎక్కువ పారదర్శకత, మెరుగైన ఆర్థిక అవకాశాలను అందిస్తుంది.
ఇది కూడా చదవండి: IPL 2025: ఐపీఎల్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 90 రోజుల ఉచితం జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ గడువు పొడిగింపు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి