Hydrogen Train: హైడ్రోజన్ రైలు పరుగులు షురూ.. ఆ రూట్‌లోనే మొదటి ట్రయల్ రన్..!
భారతదేశంలో చౌకైన ప్రజా రవాణా సాధనంగా రైల్వే ప్రయాణం అందుబాటులో ఉంది. అయితే రైలు ప్రయాణానికి పెద్ద ఎత్తున కరెంట్ అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేస్తుంది. ఇటీవల ఈ రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైడ్రోజన్ రైలు గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

రైలు రవాణాలో భారతదేశంలో ప్రభుత్వం ఇటీవల కీలక అడుగు వేసింది. భారత రైల్వేల ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న మొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ లైన్‌లో ట్రయల్ కార్యకలాపాలను ప్రారంభించింది. అయితే ఈ ట్రయల్ రన్‌లో సానుకూల ఫలితాలు వచ్చినప్పటికీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఈ రైలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి చాలా నెలలో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కల్కా-సిమ్లా వంటి హై-ప్రొఫైల్ మార్గాల్లో ఈ రైలు పరుగులు పెట్టడానికి చాలా సమయం ఉందని పేర్కొంటున్నారు. అయితే ప్రారంభ ట్రయల్ రన్‌లు “చాలావరకు విజయవంతమయ్యాయి” అని భారత రైల్వేలోని ఒక సీనియర్ అధికారి ధ్రువీకరించారు. ముఖ్యంగా హైడ్రోజన్ ఇంధన సెల్ సామర్థ్యాన్ని పెంచడంలో సరైన లోడ్-బేరింగ్‌ను నిర్ధారించడంలో ఫైన్-ట్యూనింగ్ అవసరమని. అదనంగా 2-3 నెలల సాంకేతిక పని, పరీక్ష అవసరమని భావిస్తున్నారు.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) తయారు చేసిన ఈ హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పింది. దాదాపు 500–600 హార్స్‌పవర్‌తో నిండిన యూరోపియన్ హైడ్రోజన్ రైళ్ల మాదిరిగా కాకుండా భారతదేశ వెర్షన్ రికార్డు స్థాయిలో 1,200 హార్స్‌పవర్‌ను సాధించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలుగా నిలిచింది. ఈ రైలులో ఒక ప్యాసింజర్ కోచ్, హైడ్రోజన్ నిల్వ కోసం రెండు కోచ్‌లు ఉన్నాయి. ఈ రైళ్లు గంటకు 110 కి.మీ వేగంతో నడుస్తాయి. అలాగే 2,638 మంది ప్రయాణించేందుకు అనువుగా ఉంటాయి. ఇంజిన్ శక్తి, సామర్థ్యంలో ఈ అప్‌డేట్ భారతదేశానికి విస్తృత “హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్” కార్యక్రమంలో భాగంగా ఉంది.
రైల్వే మంత్రిత్వ శాఖ హైడ్రోజన్ ఇంధన సెల్ ఆధారిత రైలు అభివృద్ధికి రూ. 2,800 కోట్లు కేటాయించింది. ముందుగా 35 రైళ్లను లాంచ్ చేయాలని నిర్ణయించింది. పర్యావరణపరంగా ఎకో సెన్సిటివ్ మార్గాల్లో హైడ్రోజన్ మౌలిక సదుపాయాల కోసం అదనంగా రూ. 600 కోట్లు కేటాయించింది. కొండ ప్రాంతాలు, హెరిటేజ్ కారిడార్లలో ఈ రైళ్ల ద్వారా ప్రయాణికులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా కష్టతరమైన భూభాగాల్లో డీజిల్ ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అతి పొడవైన హైడ్రోజన్-శక్తితో నడిచే ప్యాసింజర్ యూనిట్‌గా భావిస్తున్న మొదటి 8 కోచ్ హైడ్రోజన్ రైలు అభివృద్ధిలో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి