Youtube feature: యూట్యూబ్‌లో ప్రకటనలతో విసిగిపోయారా..? నయా ఫీచర్ తీసుకువచ్చిన గూగుల్
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అయిన యూట్యూబ్ కు ఎంతో ఆదరణ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగిస్తుంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వినోదం, పర్యాటకం.. ఇలా అన్ని రంగాల్లో దీనికి ఎంతో ప్రాధాన్యం పెరిగింది. ప్రతి ఒక్కరూ వీడియోలను దీనిలో అప్ లోడ్ చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్ వచ్చాక ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ప్రజల మధ్య భౌగోళిక సరిహద్దులు చేరిగిపోయాయి.

యూట్యూబ్ లో వీడియోలను అందరూ ఉచితంగా చూడవచ్చు. అయితే మధ్యలో ప్రకటనలు వస్తుంటాయి. ఈ ప్రకటనలు లేకుండా చూడాలంటే కొంత సొమ్ము చెల్లించి ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ యూజర్లు డబ్బులు కట్టకుండా ప్రకటన రహిత వీడియోలు చూడటానికి యూట్యూబ్ యాజమాన్యమైన గూగుల్ చర్యలు తీసుకుంటోంది. యూట్యూబ్ యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు, సభ్యులను పెంచుకునేందుకు గూగుల్ కార్యాచరణ ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రకటన రహిత (ప్రకటనలు లేని) వీడియోలు చూసే అవకాశం కల్పిస్తుంది. ఈ ప్రయోగాత్మక ఫీచర్ ను అర్జెంటీనా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, టర్కీ, అమెరికా దేశాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ దేశాల్లో వచ్చిన ఫీడ్ బ్యాక్ నుంచి మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రైబర్లు నెలకు పది వరకూ ప్రకటన రహిత వీడియో వీక్షణలను పంచుకోవచ్చు. ఈ భాగస్వామ్య వీక్షణలను స్వీకరించేవారు ఎటువంటి ప్రకటనలు లేకుండా వీడియో కంటెంట్ ను చూడవచ్చు. తద్వారా వారికి యూట్యూబ్ ప్రీమియం ప్రయోజనాలపై అవగాహన కలుగుతుంది. అయితే గూగుల్ ఈ ప్రకటన రహిత వీడియోలను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.
- యూట్యూబ్ కొత్త ఫీచర్ అమల్లో ఉన్న దేశాలలో ప్రకటన రహిత వీడియోలను షేర్ చేసుకోవచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీటిని పంచుకోవచ్చు.
- యూట్యూబ్ ప్రధాన యాప్ ను తెరవాలి. మీకు యాక్టివ్ ప్రీమియం సభ్యత్వం ఉండాలి.
- వీడియో వీక్షణ పేజీ నుంచి షేర్ బటన్ పై నొక్కాలి.
- అనంతరం యాడ్ ఫ్రీ షేర్ ను ప్రెస్ చేయాలి. మీరు షేర్ చేసిన వీడియోలను ప్రకటన రహితంగా చూడటానికి యూట్యూబ్ లోకి లాగిన్ అవ్వాలి.
- మన దేశంలో ప్రస్తుతం వ్యక్తిగత ప్లాన్ కోసం యూట్యూబ్ సబ్ స్క్రిప్షన్ నెలకు రూ.149 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో రూ.89కు స్టూడెంట్ ప్లాన్ లభిస్తుంది. కుటుంబానికి రూ.299, వ్యక్తిగతంగా ప్రీపెయిడ్ కు రూ.159, త్రైమాసికానికి రూ.459, వార్షికంగా రూ.1490 చెల్లించాలి.