Home Tax Save: సొంతిల్లు ఉంటే టాక్స్ కూడా ఆదా చేయవచ్చు.. ఎలాగంటే..
హోమ్ లోన్ తీసుకున్నపుడు దానికి చెల్లించే వడ్డీపై రెండు లక్షల రూపాయల వరకూ టాక్స్ తగ్గింపు ఉంటుంది. అలాగే ఆశలపై 80సి కింద టాక్స్ మినహాయింపు వస్తుంది. ఇది మాత్రమే కాదు, ఒక ఆస్తిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని మరొక ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా టాక్స్ సేవ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇల్లు టాక్స్ ఆదా చేయడంలో ఎలా సహాయపడుతుంది అనే విషయాన్ని ..

సొంతిల్లు ఉంటే చాలు తిన్నా తినకపోయినా హాయిగా టెన్షన్ లేకుండా ఉంటుంది అనుకుంటారు చాలామంది. అయితే, సొంతిల్లు టాక్స్ కూడా సేవ్ చేస్తుంది తెలుసా? అయితే, ఆ ఇల్లు హోమ్ లోన్ ద్వారా కొనుక్కున్నది అయి ఉండాలి. హోమ్ లోన్ తీసుకున్నపుడు దానికి చెల్లించే వడ్డీపై రెండు లక్షల రూపాయల వరకూ టాక్స్ తగ్గింపు ఉంటుంది. అలాగే ఆశలపై 80సి కింద టాక్స్ మినహాయింపు వస్తుంది. ఇది మాత్రమే కాదు, ఒక ఆస్తిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని మరొక ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా టాక్స్ సేవ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇల్లు టాక్స్ ఆదా చేయడంలో ఎలా సహాయపడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు పూర్తిగా అర్ధం చేసుకుందాం.
దేశంలో అధిక జనాభా షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం లేదా ఆస్తిపై పెట్టుబడి పెడతారు.. అలాంటి పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి. నివాస ప్రాపర్టీని విక్రయించడం ద్వారా వచ్చిన లాభంతో కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే, ఆపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54 కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అదే సమయంలో, షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు, బంగారం, భూమి మొదలైన వాటితో సహా వాణిజ్య ఆస్తిని విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో కొత్త ఇంటిని కొనుగోలు చేయడం… సెక్షన్ 54F కింద పన్ను మినహాయింపు ఇస్తుంది.
సెక్షన్ 54F కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి. మొదటిది – ఆస్తిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG) అయి ఉండాలి. రెండవది- పన్ను మినహాయింపు పొందడానికి, కేవలం లాభంతో కాకుండా, అమ్మకం నుంచి వచ్చిన మొత్తం డబ్బును ఇల్లు కొనడానికే వినియోగించాలి. ఆస్తిని అమ్మడం వల్ల వచ్చే లాభం దీర్ఘకాలిక మూలధన లాభం కాదా? అనే సందేహం ఇప్పుడు రావచ్చు. ఇది హోల్డింగ్ పీరియడ్‌పై ఆధారపడి ఉంటుంది, అంటే ఆస్తి ఎంతకాలం పాటు మన స్వాధీనంలో ఉంది లేదా దానిని కొన్న ఎంత కాలం తరువాత అమ్మారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వివిధ ప్రాపర్టీల కోసం ఎల్‌టీసీజీ ప్రమాణాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఒక షేర్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసిన 12 నెలల తర్వాత విక్రయించినట్లయితే.. అది దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా లెక్కలోకి వస్తుంది. దాని నుంచి వచ్చే లాభం దీర్ఘకాలిక మూలధన లాభంగా లెక్కిస్తారు. అటువంటి ఆదాయంపై 10 శాతం పన్ను ఉంది. అదే విధంగా, ఎల్‌టీసీజీ కోసం, బంగారం 36 నెలల పాటు ఉంచాలి. ఆస్తి – అన్‌లిస్టెడ్ షేర్లకు, ఈ పరిమితి 24 నెలలు.. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను బంగారం, ఆస్తి – లిస్ట్ చేయని షేర్లకు 20 శాతం టాక్స్ ఆదా అవుతుంది.
ఉదాహరణకు, మీరు సిప్ ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ప్రతి నెలా రూ. 30,000 పెట్టుబడి పెడితే.. 12 శాతం వార్షిక రాబడితో మీరు 10 సంవత్సరాల తర్వాత దాదాపు రూ. 70 లక్షలు పొందుతారు. 10 సంవత్సరాలలో మీరు రూ. 36 లక్షలు డిపాజిట్ చేసారు. దానిపై రూ. 33 లక్షల 70 వేలు లాభం ఉంటుంది. అంటే ఇది మూలధన లాభం.. ఈ ఆదాయంపై 10 శాతం చొప్పున దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను చెల్లించాలి. ఇది రూ. 3.36 లక్షలు అవుతుంది.
సెక్షన్ 54F కింద మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.36 లక్షల పన్ను ఆదా చేయవచ్చు. కొత్త ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి, కేవలం లాభమే కాదు, మొత్తం డబ్బు, అంటే దాదాపు రూ. 70 లక్షలు ఉపయోగించాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపు పొందడానికి, పాత ఆస్తిని బదిలీ చేసిన తేదీ నుంచి 2 సంవత్సరాలలోపు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి. అంటే మ్యూచువల్ ఫండ్ యూనిట్ అమ్మిన తరువాత రెండేళ్ల లోపు ఇంటిని కొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఇల్లు కట్టుకోవడం చేస్తే కనుక 3 సంవత్సరాలలోపు ఇంటిని పూర్తి చేయాలి. పాత ఆస్తిని విక్రయించడానికి ఒక సంవత్సరం ముందు కూడా మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేస్తే, మీరు తగ్గింపును పొందవచ్చు. సెక్షన్ 54F కింద పన్ను మినహాయింపు పొందడానికి, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.
ఆస్తిని విక్రయించే సమయంలో, మీకు ఒకటి కంటే ఎక్కువ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉండకూడదు అంటే మీకు ఒక ఇల్లు ఉంటే, ఈ విభాగం ప్రయోజనాన్ని పొందడానికి మీరు మరొక ఇంటిని కొనుగోలు చేయవచ్చు. మీరు సెక్షన్ 54F మినహాయింపు తీసుకున్న ఇంటిని కొనుగోలు చేసిన 3 సంవత్సరాలలోపు ఆ ఇంటిని అమ్మడం కుదరదు. ఆ లోపు అమ్మితే మినహాయింపు గడువు ముగుస్తుంది.. మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మీరు సెక్షన్ 54F కింద ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే.. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసే తేదీ వరకు మూలధన లాభాలను ఉపయోగించుకోలేకపోతే.. అప్పుడు ఆ డబ్బును క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ (CGAS) కింద బ్యాంకులో జమ చేయాలి. లేని పక్షంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఈ అకౌంట్‌లో డబ్బు ఉంచినప్పటికీ, మీరు రెసిడెన్షియల్ ప్రాపర్టీని 2 సంవత్సరాలలోపు కొనుగోలు చేయాలి.. లేదా 3 సంవత్సరాలలోపు నిర్మించుకోవాలి.. లేకుంటే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి.
సెక్షన్ 54F ద్వారా మీరు క్యాపిటల్ గెయిన్స్‌తో ఇంటిని కొనుగోలు చేయవచ్చు. లక్షల రూపాయల పన్నును ఆదా చేయవచ్చు. వాస్తవానికి, పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా మీరు ఇంటిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. కానీ అది దుర్వినియోగం కాకుండా చూసుకోవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి సెక్షన్ 54F కింద, ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా రూ. 10 కోట్ల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను మాత్రమే ఆదా అవుతుంది. దీని పైన వచ్చే లాభాలపై మీరు పన్ను చెల్లించాల్సి రావచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








