Gold Rate: బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారా..? అసలు గుట్టు..
పసిడి ధరల నిర్ణయంలో పారదర్శకత లోపించిందా? కొంతమంది వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా రేట్లను పెంచేస్తూ వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తున్నారా? ప్రముఖ నగల వ్యాపారి మలబార్ గోల్డ్ చైర్మన్ ఎం.పి. అహ్మద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశీయ స్వర్ణ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. అసలు బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు అనేది తెలుసుకుందాం..

బంగారం అంటే భారతీయులకు ఒక ప్రత్యేక సెంటిమెంట్. ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు ఆపదలో ఆదుకునే అత్యవసర నిధి. ప్రస్తుతం ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. క్రమంలో అసలు బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారు అనేది చాలా మందికి ఉండే డౌట్. ఈ ధరలపై మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎం.పి. అహ్మద్ సంచలన ఆరోపణలు చేశాడు. ఒకరకంగా ఇది పసిడి ప్రియులకు షాకిచ్చేదిగా చెప్పొచ్చు. దేశంలో బంగారం ధరల నిర్ణయం పారదర్శకంగా జరగడం లేదని, కొంతమంది వ్యాపారులు తమకు తోచినట్లుగా రేట్లు పెంచేస్తున్నారని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎం.పి. అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఏకపక్ష నిర్ణయాల వల్ల సామాన్య వినియోగదారులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ధర ఎలా నిర్ణయించాలి..?
సాధారణంగా బంగారం ధరను మూడు ప్రధాన అంశాలు శాసిస్తాయి..
అంతర్జాతీయ మార్కెట్ ధరలు: ప్రపంచవ్యాప్తంగా పసిడి ట్రేడింగ్‌లో వచ్చే మార్పులు.
రూపాయి విలువ: అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువ.
దిగుమతి సుంకాలు: ప్రభుత్వం విధించే ట్యాక్స్ రేట్లు.
ఈ మూడు అంశాల్లో మార్పులకు అనుగుణంగా ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల లోపు వాణిజ్య సంఘాలు ధరను పారదర్శకంగా ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత మార్కెట్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని అహ్మద్ తెలిపారు.
అసంబద్ధ పద్ధతులు.. విశ్వసనీయతకు ముప్పు..
“ప్రభుత్వం పన్ను రేట్లను మార్చనప్పటికీ, కొంతమంది వ్యాపారులు వినియోగదారులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా ధరలు పెంచుతున్నారు. మార్కెట్‌లో పెద్దగా హెచ్చుతగ్గులు లేని సమయంలో కూడా ఇలా రేట్లు పెంచడం అశాస్త్రీయం. ఇటువంటి చర్యలు దేశీయ బంగారు వ్యాపార రంగంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి” అని ఆయన హెచ్చరించారు.
ఒకే భారత్ – ఒకే ధర
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ప్రాంతానికో రకంగా ఉండటం వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తోంది. ఈ వ్యత్యాసాలను తొలగించడానికి మలబార్ గోల్డ్ వన్ ఇండియా – వన్ గోల్డ్ రేట్ అనే వినూత్న చొరవను ప్రారంభించింది. ఈ విధానం ప్రకారం, భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా మలబార్ గోల్డ్ షోరూమ్‌లలో బంగారం ఒకే ధరకు లభిస్తుంది. ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా, పారదర్శకతను పెంచుతుందని సంస్థ భావిస్తోంది.
వినియోగదారులు ఏం గమనించాలి?
బంగారం కొనుగోలు చేసేటప్పుడు కేవలం మేకింగ్ ఛార్జీలు మాత్రమే కాకుండా ఆ రోజు అసలు బంగారం ధర ఎంత ఉందో సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అహ్మద్ చేసిన ఈ ప్రకటనతో మున్ముందు దేశవ్యాప్తంగా బంగారం ధరల నిర్ణయంలో ప్రభుత్వం లేదా జాతీయ సంస్థలు ఒక క్రమబద్ధమైన విధానాన్ని తీసుకువస్తాయేమో చూడాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
