GST: కొత్త జీఎస్టీ రేట్లు.. పెట్రోల్.. మద్యం ధరలు తగ్గాయా..?
జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రావడంతో దాదాపు 375 ఉత్పత్తులపై పన్నులు తగ్గాయి. దీంతో ఫుడ్ నుంచి మొదలు ఎలక్ట్రానిక్స్ వరకు ధరలు తగ్గనున్నాయి. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయా..? మద్యం ప్రియులకు ఏమైనా గుడ్ న్యూస్ ఉందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కేంద్రం తీసుకవచ్చిన జీఎస్టీ సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. స్వదేశీ వస్తువుల వాడకం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం జీఎస్టీ రేట్లను తగ్గించింది. ఇప్పుడు దేశంలో 5, 18శాతం జీఎస్టీ శ్లాబ్‌లు మాత్రమే ఉన్నాయి. కొత్త సంస్కరణల ప్రకారం.. 12శాతం జీఎస్టీ స్లాబ్‌లో ఉన్న 99శాతం వస్తువులు ఇప్పుడు 5శాతం శ్లాబ్‌లోకి వచ్చాయి. అదేవిధంగా 28శాం శ్లాబ్‌లో ఉన్న 90శాతం ఉత్పత్తులు 18శాతం శ్లాబ్‌లోకి వచ్చాయి. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం విలాసవంతమైన ఉత్పత్తులను కోసం 40శాతం ట్యాక్స్ విధించింది. ఈ శ్లాబ్‌లో పొగాకు, సిగరెట్లు, లగ్జరీ కార్లు, కొన్ని ఇతర వస్తువులు ఉంటాయి.
పెట్రోల్ – డీజిల్ ధరలు
ఈ GST సంస్కరణలు ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ఈ మార్పుల వల్ల దాదాపు 375 ఉత్పత్తులపై పన్నులు తగ్గాయి. అయితే ఈ కొత్త జీఎస్టీ సంస్కరణలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేయవు. ప్రస్తుతం ఈ ఇంధనాలు జీఎస్టీ పరిధిలోకి రావడం లేదు. వాటి ధరలు ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులపై ఆధారపడి ఉంటాయి. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తే రాష్ట్రాలు వ్యాట్‌ను విధిస్తాయి. దీనివల్ల రాష్ట్రాల మధ్య ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని కోల్పోకుండా చూసుకోవడానికి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఇష్టపడటం లేదు. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అనేక పథకాలకు నిధులుగా ఉపయోగపడుతుందని ప్రభుత్వాలు వాదిస్తున్నాయి.
మద్యం ధరలు
పెట్రోల్, డీజిల్ లాగే మద్యం ధరలపైనా ఈ కొత్త జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఉండదు. మద్యంపై పన్ను విధించే అధికారం ఇప్పటికీ రాష్ట్రాలకే ఉంది. రాష్ట్రాలకు మద్యం అమ్మకాల నుండి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. అందుకే వారు దానిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడానికి సుముఖంగా లేరు. మద్యంపై విధించే ఎక్సైజ్ సుంకం, వ్యాట్ రాష్ట్రాల నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. దీనివల్ల ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర ఉంటుంది. ఉదాహరణకు గోవాలో ఎక్సైజ్ సుంకం 55 శాతం ఉండగా కర్ణాటకలో ఇది 80శాతం వరకు ఉంటుంది. ఎన్నో ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గినా పెట్రోల్, డీజిల్ మరియు మద్యం ధరలలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




