Fixed Medical Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారికి వైద్యభత్యం పెంపు
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇటీవల పెన్షనర్ల సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఎన్‌పీఎస్ పథకంలో ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై స్థిర వైద్యభత్యం పొందేలా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్‌పీఎస్) పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా స్థిర వైద్య భత్యం (ఎఫ్ఎంఏ) పొందుతారని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డీఓపీపీడబ్ల్యూ) ప్రకటించింది. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే కొత్త ఫారమ్‌లు జోడించారు. అలాగే చెల్లింపు ప్రక్రియను కూడా స్పష్టం చేశారు. దీంతో పాటు వైద్యభత్యం కొనసాగింపు కోసం ప్రతి ఏడాది జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి అని నిపుననులు చెబుతున్నారు.
ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ (స్థిర వైద్య భత్యం) అనేది పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చే నెలవారీ భత్యం. ఇది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లో నివసించే వారి కోసం రూపొందించారు. ఉద్యోగులకు వారి ప్రాథమిక వైద్య అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడేలా ఈ ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ అందిస్తారు. ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చే రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థిర వైద్య భత్యం పొందవచ్చు. అయితే వారు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) స్కీమ్‌కు అర్హులై ఉండాలి. ఎన్‌పీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ రేటు నెలకు రూ. 1,000గా నిర్ణయించింది. ఈ మొత్తం పాత పెన్షన్ పథకం కింద ఉన్నవారికి సమానం.
అయితే పెన్షనర్ జీవించి ఉన్నారని, ప్రయోజనాలను పొందడానికి అర్హులని నిర్ధారించుకోవడానికి పదవీ విరమణ చేసిన కేంద్ర ఉద్యోగులు జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి చేశారు. లైఫ్ సర్టిఫికేట్ అనేది పెన్షనర్ సజీవంగా ఉన్నారని నిర్ధారించే పత్రం. పెన్షనర్లు తమ పెన్షన్‌ను కొనసాగించడానికి పెన్షన్ ఏజెన్సీలు సాధారణంగా జీవన్ ప్రమాణ్ అని కూడా పిలిచే లైఫ్ సర్టిఫికేట్‌ను కోరుతాయి. ఈ సర్టిఫికెట్ కోసం మీరు ఆధార్ కార్డ్, బయోమెట్రిక్ ఉపయోగించి జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా మీ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని డిజిటల్‌గా సమర్పించవచ్చు. అయితే పెన్షనర్ తన జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించకపోతే ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ చెల్లింపు నిలిపివేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




