DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. హోలీ నుంచి డీఏ పెంపు?
భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు విషయంలో ప్రభుత్వ గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

హోలీకి ముందు జనవరి-జూన్ జీతాల పెంపు సమయంలో కేంద్రం డీఏ పెంపును ప్రకటించనున్నందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం ఈ నెల హోలీకి ముందు ప్రభుత్వం 2 శాతం డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సంవత్సరానికి రెండుసార్లు (జనవరి, జూలై నుంచి అమల్లోకి వచ్చేలా) ప్రకటించే డీఏ పెంపు, ద్రవ్యోల్బణ రేటు ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల టేక్-హోమ్ జీతాలను పెంచుతుంది. హోలీకి ముందు చేసే డీఏ పెంపుదల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం 2 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పెంపు తర్వాత డీఏప్రాథమిక వేతనంలో 53 శాతం నుంచి 55 శాతానికి పెరుగుతుంది. అయితే దీనిపై తుది నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగే కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సి ఉంది.
2024 అక్టోబర్‌లో గతంలో జరిగిన డీఏ పెంపులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు లభించింది. ఇది జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పెంపు తర్వాత డీఏ ప్రాథమిక వేతనంలో 50 శాతం నుండి 53 శాతానికి పెరిగింది. పెన్షనర్లకు ఇదే స్థాయిలో డీఏ పెంపును అందించారు. రెండు శాతం డీఏ పెంపుతో నెలకు దాదాపు రూ. 18,000 బేసిక్ జీతం ఉన్న ఎంట్రీ లెవల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం జనవరి 1, 2025 నుండి నెలకు రూ. 360 వరకు పెరుగుతుంది. ఎవరికైనా నెలకు రూ. 30,000 జీతం ఉండి, రూ. 18,000 ప్రాథమిక వేతనం ఉంటే, అతను లేదా ఆమెకు ఇప్పుడు రూ. 9,540 డియర్‌నెస్ అలవెన్స్ లభిస్తుంది, ఇది ప్రాథమిక వేతనంలో 53 శాతం. అయితే అంచనా వేసిన 2 శాతం పెంపు తర్వాత ఉద్యోగికి నెలకు రూ. 9,900 లభిస్తుంది.
జూన్ 2022తో ముగిసిన కాలానికి అఖిల భారత వినియోగదారుల ధరల సూచికకు సంబంధించిన 12 నెలల సగటు పెరుగుదల శాతం ఆధారంగా డీఏ, డీఆర్ పెంపు నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీల్లో భత్యాలను సవరిస్తుంది. అయితే ఈ నిర్ణయం సాధారణంగా మార్చి, సెప్టెంబర్‌లలో ప్రకటించబడుతుంది. 2006లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మరియు డీఆర్ లెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రాన్ని సవరించింది. ఏడో వేతన సంఘం పదవీకాలం ఈ సంవత్సరం ముగియనున్నప్పటికీ తన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం జనవరిలో 8వ వేతన సంఘాన్ని ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి