Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? అతి తక్కువ వడ్డీకే లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇవే..
అర్జెంట్‌గా డబ్బు అవసరం పడగానే మనకు టక్కున గుర్తొచ్చేది లోన్. ఈ మధ్య కాలంలో లోన్స్ తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ఎమర్జెన్సీ టైమ్‌లో ఇతర లోన్స్ కంటే గోల్డ్ లోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బంగారం ధరలు పెరగడం, ఆర్బీఐ నిబంధనల సడలింపుతో గోల్డ్ లోన్ క్రేజ్ రికార్డు స్థాయికి చేరింది. ప్రముఖ బ్యాంకుల్లో రూ.8.05 నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు, కాలపరిమితులు, లోన్ లిమిట్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బంగారు రుణాలకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. ఎందుకంటే 2025 నాటికి ఈ లోన్స్ ఏకంగా 122శాతం పెరిగి రూ.2.94 లక్షల కోట్ల బిజినెస్‌ను దాటేశాయి. బంగారం ధరలు పెరగడం, ఆర్బీఐ కొత్తగా నిబంధనలను సులభతరం చేయడం వంటివి దీనికి ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. డబ్బు అత్యవసరంగా అవసరమైనప్పుడు గోల్డ్ లోన్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇది చాలా ఫాస్ట్‌గా, నమ్మకంగా డబ్బు అందించే మార్గం.
బంగారం ఎందుకంత పెరిగింది?
ఈ సంవత్సరం బంగారం కూడా అదిరిపోయే రేంజ్‌లో 44శాతం లాభాలను ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు గత పదేళ్లుగా బంగారం కొనుగోళ్లను డబుల్ చేశాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా బంగారం ధరల ర్యాలీకి కిక్ ఇచ్చింది. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా, జనాలు సేఫ్టీ కోసం బంగారం వైపు మళ్లుతున్నారు. అందుకే డిమాండ్ పెరిగి ధరలు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి.
బంగారం ధర పెరిగితే, మీరు తాకట్టు పెట్టే బంగారానికి ఎక్కువ లోన్ వస్తుంది. అందుకే గోల్డ్ లోన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. లోన్ తీసుకున్న వాళ్లు మెచ్యూరిటీ అయ్యేవరకు వడ్డీ కట్టాలి. ఈ వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారుతుంటాయి. 8.05శాతం నుంచి వడ్డీ రేట్లు స్టార్ట్ అవుతాయి.
ప్రముఖ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా:
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.05శాతం నుంచి 8.35శాతం వడ్డీ రేటుతో గరిష్టంగా 12 నెలల కాలపరిమితితో లోన్స్ అందిస్తోంది. దీని ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 0.25శాతం. దీనికి జీఎస్టీ అదనం. ఇక్కడ రుణ పరిమితి రూ.10,000 నుండి రూ.40 లక్షల వరకు ఉంది.
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వడ్డీ రేటు 8.20శాతం−11.60శాతం మధ్య ఉంటుంది. లోన్ కాలపరిమితి గరిష్టంగా 12 నెలలు కాగా ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తాన్ని బట్టి మారుతుంది. లోన్ లిమిట్ రూ.25,000 నుండి రూ.50 లక్షల వరకు లభిస్తుంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.35శాతం నుండి వడ్డీ రేటును విధిస్తుంది. లోన్ కాలపరిమితి 12 నెలలు. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.30శాతంతో పాటు జీఎస్టీ వర్తిస్తుంది. ఈ బ్యాంకులో లోన్ లిమిట్ రూ.25,000 నుండి రూ.25 లక్షల వరకు ఉంది.
- బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.6శాతం−8.75శాతం వడ్డీ రేటుతో గరిష్టంగా 12 నెలల కాలపరిమితితో రుణాలు ఇస్తుంది. దీని ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా రూ.1,500 వరకు ఉంటుంది. ఇక్కడ లోన్ లిమిట్ రూ.20,000 నుండి రూ.30 లక్షల వరకు ఉంది.
- ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.75శాతం నుండి వడ్డీ రేటును విధిస్తుంది. ఈ బ్యాంకు ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ కాలపరిమితిని అంటే గరిష్టంగా 36 నెలల వరకు రుణాలు అందిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 0.25శాతం ఉంటుంది. లోన్ లిమిట్ రూ.20,000 నుండి రూ.50 లక్షల వరకు ఉంది.
మీకు లోన్ ఎంత కాలం కావాలి? ఎంత తక్కువ వడ్డీ ఉంటే మంచిది? ఇలా అన్ని చూసుకుని, మీ అవసరానికి తగ్గట్టుగా బ్యాంకును ఎంచుకోండి. ఇప్పుడున్న ట్రెండ్‌ను బట్టి చూస్తే, గోల్డ్ లోన్ హవా ఇప్పట్లో ఆగేలా లేదు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




