EPF: ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే బెనిఫిట్..!
Provident Fund: దీపావళి పండుగల వేళ పీఎఫ్ చందాదారులందరికీ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది..
Provident Fund: దీపావళి పండుగల వేళ పీఎఫ్ చందాదారులందరికీ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది. పీఎఫ్ ఖాతాదారులకు ఈ ఆర్థిక సంవత్సరానికి (2020-2021) గాను అందించే వడ్డీని దీపావళి ముందే వారి ఖాతాల్లో జమచేసేందుకు సిద్ధమైంది. దీంతో దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం కలుగనుంది. ఈపీఎఫ్‌ఓ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ చందాదారుల ఖాతాకు 8.5 శాతం వడ్డీని జమ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 28న ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించడంతో ఈ మొత్తం వారి ఖాతాలో జమ కానుంది.
అయితే చివరిసారిగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేవైసీ (నో యువర్ కస్టమర్) ఆటంకాల కారణంగా చాలా మంది సబ్‌స్క్రైబర్‌లు వడ్డీని పొందడానికి 8 నుంచి 10 నెలల వరకు వేచి చూడాల్సి వచ్చింది. దేశంలో 6.5 కోట్ల మంది పీఎఫ్ పరిధిలోకి వస్తారు. ఇందుకు కేంద్ర కార్మికశాఖ కూడా అనుమతి లభించింది. దీంతో 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని చందాదారులకు పండగకు ముందే అందించనున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాలనుకున్న వడ్డీ రేటు 8.5 శాతం గత ఏడేళ్లలో ఇదే కనిష్ఠం. 2018లో 8.55 శాతం వడ్డీ ఇవ్వగా.. 2019లో 8.35శాతం అందించింది. అయితే, కొవిడ్ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారులకు నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడం వల్లే ఈసారి తక్కువ వడ్డీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలి అనుకుంటే..
వడ్డీ రేటు తమ పీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యిందో లేదో అని తెలుసుకునేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి.
► ముందుగా ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ కి వెళ్లండి.
► సర్వీసెస్ విభాగానికి వెళ్లి ఉద్యోగుల ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
► తర్వాత సర్వీసెస్‌లలో మెంబర్ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి.
► యుఏఎన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చార్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. కొత్త పేజీలో మీ ఐడిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
► వ్యూపాస్‌బుక్‌పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈపీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు పొందుతారు. అలాగే వడ్డీ వివరాలు కూడా కనిపిస్తాయి.
వడ్డీకి జమ చేసిన విషయాన్ని ఈపీఎఫ్‌ఓ చందాదారుల ఫోన్‌కు మెసేజ్ రూపంలో కూడా తెలియజేస్తుంది. చందాదారుడే మెసేజ్ చేసి తెలుసుకోవాలనుకుంటే.. పీఎఫ్‌లో రిజిస్టరైన నంబర్ నుంచి EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 మొబైల్ నంబరుకు మెసేజ్ చేయాలి. లేదా 011-22901406 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్, ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.