EV Scooter Firing: వినియోగదారుల గుండెల్లో ఈవీ స్కూటర్ల మంటలు.. పూణే వెలుగులోకి మరో ఘటన
ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనం ద్వారా నడిచే వాహనాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ఆగమనంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కీలక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఈవీ స్కూటర్లను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనం ద్వారా నడిచే వాహనాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ఆగమనంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కీలక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఈవీ స్కూటర్లను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. మొదట్లో పట్టణ ప్రాంతాలకే పరమితమైన ఈవీ స్కూటర్లు క్రమేపి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాయి. అయితే ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్లు వరుసగా అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. అకస్మాత్తుగా స్కూటర్ బ్యాటరీ లేదా ఇంజిన్ ప్రాంతం నుంచి అదుపు చేయలేనంతగా మంటలు వ్యాపించడంతో వినియోగదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆ తాజాగా ఇలాంటి సంఘటనే పూణేలో వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ఆ అగ్నిప్రమాద ఘటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
పూణెలోని సోలాపూర్ రోడ్డులో ఫాతిమానగర్‌కు సమీపంలో ఉన్న కాళూబాయి టెంపుల్ చౌక్ సమీపంలో ఇటీవల ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. అలాగే మరో అగ్నిప్రమాదంలో పీఎంపీఎంఎల్ ఏసీ ఈవీ బస్సు కూడా దగ్ధమైంది. ఇలా వరుస సంఘటన ఈవీ వాహనాలను వాడే వారిని భయపెడుతున్నాయి. ఫాతిమా నగర్‌కు సమీపంలో జరిగిన ఘటన గురించి మాట్లాడితే ఆ ఈవీ స్కూటర్ యజమాని జావేద్ బుధానీ స్కూటర్‌పై హడప్సర్ నుంచి పూణే వైపు ప్రయాణిస్తుండగా అతని వాహనం నుండి పొగలు వస్తున్నాయని తోటి వాహనదారుడు అతన్ని అప్రమత్తం చేశాడు. జావేద్ వేగంగా వచ్చి స్కూటర్ దిగాడు. క్షణాల్లో స్కూటర్‌కు మంటలు అంటుకోగా, 10 నిమిషాల్లోనే అది పూర్తిగా బూడిదైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
కేవలం ఒక సంవత్సరం క్రితం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసిన జావేద్ మొత్తం వాహనం మంటల్లో కాలిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియలేదు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వరుస సంఘటనలు ఈవీ వాహనాల భద్రతకు సంబంధించిన అనుమానాలు బలపరుస్తున్నాయి. అయితే ఈవీ వాహనాల నిర్వహణ సరిగ్గా ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాటరీపై అధిక ప్రెజర్ లేకుండా చూసుకుంటే అగ్ని ప్రమాద సమస్యలు ఉండవని సూచిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..