AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google One Lite Plan: స్టోరేజ్ సరిపోవడం లేదా? గూగుల్ కొత్త ప్లాన్‌.. ఉచితంగా 30 జీబీ.. ట్రై చేయండి..

క్లౌడ్ స్టోరేజీ విభాగంలో ప్రస్తుతం నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరకే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ వన్ లైట్ ప్లాన్ కోసం నెలకు రూ.59 చెల్లించాలి. దీని వల్ల 30 జీబీ స్టోరేజీ సామర్థ్యం లభిస్తుంది. రూ.589 చెల్లించి వార్షిక సభ్యత్వం పొందవచ్చు. అలాగే ఒక నెల ఫ్రీ ట్రయల్ అవకాశం కూడా ఉంది.

Google One Lite Plan: స్టోరేజ్ సరిపోవడం లేదా? గూగుల్ కొత్త ప్లాన్‌.. ఉచితంగా 30 జీబీ.. ట్రై చేయండి..
Google One Lite Plan
Madhu
|

Updated on: Sep 13, 2024 | 3:21 PM

Share

గూగుల్ యూజర్లకు మరో కొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా క్లౌడ్ స్టోరేజీ పెంచడానికి గూగుల్ వన్ లైట్ ప్లాన్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా తక్కువ ఖర్చుతో స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అదనపు స్టోరేజీ పెంచేందుకు ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్ తో యూజర్లకు చాలా ఉపయోగం కలుగుతుంది. క్లౌడ్ స్టోరేజీ విభాగంలో ప్రస్తుతం నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరకే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ వన్ లైట్ ప్లాన్ కోసం నెలకు రూ.59 చెల్లించాలి. దీని వల్ల 30 జీబీ స్టోరేజీ సామర్థ్యం లభిస్తుంది. రూ.589 చెల్లించి వార్షిక సభ్యత్వం పొందవచ్చు. అలాగే ఒక నెల ఫ్రీ ట్రయల్ అవకాశం కూడా ఉంది.

స్టోరేజీ కోసమే..

గూగుల్ వన్ లైట్ ప్లాన్ ద్వారా కేవలం స్టోరేజీ మాత్రమే లభిస్తుంది. ఇతర ఏ ఫీచర్లు అందుబాటులోకి రావు. జీమెయిల్, గూగుల్, గూగుల్ డ్రైవ్ తదితర సర్వీసులకు సంబంధించి అదనపు ఉపయోగం కలుగుతుంది. గూగుల్ తన వినియోగదారులకు 15 జీబీ ఉచిత స్టోరేజీ అందిస్తోంది. అయితే పెరిగిన వినియోగం నేపథ్యంలో అది సరిపోవడం లేదు. వారికి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో కొత్త ప్లాన్ ను అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఫైళ్లు, డేటాను నిల్వ చేయడానికి తగినంత స్థలం అందుతుంది. కొత్త ప్లాన్ లో నెలకు రూ.59 చెల్లించి, 30 జీబీ క్లౌడ్ స్టోరేజీని పొందవచ్చు. గూగుల్ ఫొటోలు, డ్రైవ్, జీమెయిల్ లో నిల్వ స్థలాన్ని పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో ఏఐ తదితర ఫీచర్లు లేవు. కేవలం స్టోరేజీ పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

దశలవారీగా విడుదల..

గూగుల్ వన్ లైట్ ప్లాన్ ను గూగుల్ దశల వారీగా విడుదల చేస్తోంది. ప్రస్తుతం అందరికీ పూర్తిగా అందుబాటులోకి రాకపోవచ్చు. అయితే గూగుల్ వన్ సెట్టింగ్ లలో తనిఖీ చేస్తే మీకు అర్హత ఉందో లేదో తెలుస్తుంది. ప్రస్తుతం నెలవారీ సభ్యత్వానికి రూ.59 చెల్లించాలి. వార్షిక చందాగా ఏడాదికి రూ.589 కడితే సరిపోతుంది. అలాగే ఈ ప్లాన్ ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఒక నెల ఉచితంగా ట్రయల్ వేసుకోవచ్చు.

మరో ఫీచర్..

ఆస్క్ ఫొటోస్ అనే కొత్త ఫీచర్ ను కూడా గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. పరికరంలో మనకు కావాల్సిన ఫొటోలు, వీడియోలను సులభంగా వెతకడానికి ఉపయోగపడుతుంది. కేవలం నోటితో మనం చెబితే ఆ సందర్భంలో తీసుకున్న ఫొటోలను బయటకు తీస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫొటోలను వెతుక్కోవాల్సిన పని లేకుండా తక్షణమే అందజేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..