టెక్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు! ఎందుకంటే..?
ప్రపంచ చిప్ కొరత, AI చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. IDC నివేదిక ప్రకారం, ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ ధరలు 14 శాతం పెరిగే అవకాశం ఉంది, ముఖ్యంగా తక్కువ ధర ఫోన్లు మరింత ఖరీదైనవిగా మారతాయి. Samsung, Vivo వంటి బ్రాండ్లు ఇప్పటికే ధరలు పెంచుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న చిప్ కొరత బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడిని తెచ్చింది. కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీకి పెరుగుతున్న డిమాండ్ కారణంగా మెమరీ చిప్‌ల సరఫరా కుదించుకుపోయి, మొత్తం గ్లోబల్ సరఫరా గొలుసు ప్రభావితమైంది. మార్కెట్ పరిశోధన సంస్థ IDC తాజా నివేదిక ప్రకారం, ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్‌ల సగటు ధరలు 14 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా తక్కువ ధర ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు రాబోయే నెలల్లో ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చని నివేదిక హెచ్చరించింది.
గత దశాబ్దంలోనే అతిపెద్ద స్థాయిలో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో పడిపోవడం కనిపించవచ్చని IDC పేర్కొంది. చిప్ కొరతతో పాటు భాగాల ఖర్చులు పెరగడంతో కంపెనీలు ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. ఉదాహరణకు, Samsung Electronics వంటి ప్రముఖ బ్రాండ్లు తమ పరికరాల ధరలను పెంచడం ప్రారంభించాయి. IDC అంచనాల ప్రకారం ముఖ్యంగా 100 డాలర్లు (సుమారు రూ.9,000) లోపు ధర గల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ పరిస్థితికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. మెమరీ చిప్‌ల ధరలు పెరగడం వల్ల ఈ సెగ్మెంట్‌లో సగటు అమ్మకపు ధర గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
ఇక చైనా బ్రాండ్లు Vivo, iQOO కూడా తమ కొన్ని మోడళ్ల ధరలను పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. భారత మార్కెట్‌లో వీటి ప్రభావం త్వరలోనే కనిపించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఒక ఊరటనిచ్చే అంశం కూడా ఉంది. సరఫరా గొలుసులో మెరుగుదలలు జరిగితే, 2027 ద్వితీయార్థం నాటికి స్మార్ట్‌ఫోన్ ధరలు స్థిరపడే అవకాశం ఉందని IDC అంచనా వేసింది. అప్పటివరకు వినియోగదారులు కొనుగోలు నిర్ణయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
