Electric Car Prices: ఎలక్ట్రిక్ కార్ల ధరలపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. అది సాధ్యమేనా.?
Electric Car Prices: విపరీతంగా ఇంధన వినియోగంతో కాలుష్యం పెరుగుతుండడంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా దేశాల్లో ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి..
Electric Car Prices: విపరీతంగా ఇంధన వినియోగంతో కాలుష్యం పెరుగుతుండడంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా దేశాల్లో ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెద్ద పీఠ వేస్తున్నాయి. అందులోనూ బడా కంపెనీలు ఈ వాహనాల తయారీలోకి అడుగుపెట్టడంతో వీటి వినియోగం కూడా బాగా పెరిగింది. అయితే ఈ వాహనాల కొనుగోళ్లలో వచ్చే ప్రధాన సమస్య వీటి ధర. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాల ధరలు ఎక్కవ ఉండడమే దీనికి కారణం. అయితే రానున్న రెండేళ్లలో విద్యుత్ ఆధారిత వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఎలక్ట్రిక్ కార్ల ధరలపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇంతకీ మంత్రి చేసిన ఆ వ్యాఖ్యలేంటంటే.. విద్యుత్‌తో నడిచే కార్ల ధరలు రానున్న రెండేళ్లలో పెట్రోల్, డీజిల్ కార్ల ధరలకు సమానంగా మారనున్నాయని ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి ఉదాహరణగా టాటా నెక్సాన్ కారును ప్రస్తావించారు. ప్రస్తుతం నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ధర రూ.13.99 లక్షలు ఉండగా.. దాని పెట్రోల్ వెరియంట్ ధర కేవలం రూ.7 లక్షలకే అందుబాటులో ఉంది. కాబట్టి టాటా తన నెక్సా కారు ధరను రూ. ఏడు లక్షలకు తగ్గించాలంటూ మంత్రి సూచించారు. అంటే కార్ల కంపెనీలు ధరలను దాదాపు 50 శాతం తగ్గించాల్సి ఉంటుంది. ఇదే విషయమై మంత్రి మాట్లాడుతూ.. ‘మనం బీఎస్6 వాహనాల విషయంలో విజయవంతమయ్యాయి. దీనికి కార్ల కంపెనీలకు నా కృజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ప్రతి ఏటా సుమారు రూ.80వేల కోట్ల క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. ఇది మన ఆర్థిక వ్యవస్థతో పాటు వాతావరణ కాలుష్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది అందరూ గమనించాల్సిన విషయం. ప్రస్తుతం భారత దేశంలో ఉపయోగిస్తోన్న లిథియం బ్యాటరీల్లో 80 శాతం మననే తయారు చేసుకుంటున్నాం. రానున్న రెండేళ్లలో ఇది 100 శాతానికి చేరుకుంటుందని నేను ఆశతో ఉన్నాను. రానున్న రెండేళ్లలో విద్యుత్‌తో నడిచే ద్విచక్ర, ఫోర్ వీలర్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయనేది నా వ్యక్తిగత భావన. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయని నాకూ తెలుసు.. కానీ ప్రస్తుతం వాహనాల తయారీ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు దీన్ని సుసాధ్యం చేస్తాయని నేను చాలా నమ్మకంతో ఉన్నాను. ముఖ్యంగా బ్యాటరీ టెక్నాలజీలో చోటుచేసుకుంటున్న మార్పులు దీనికి కారణంగా చెప్పవచ్చు’ అని చెప్పుకొచ్చారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు వినడానికి బాగానే ఉన్నా ఇది సాధ్యమయ్యేనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల ధరలను ఏకంగా 50 శాతం తగ్గించడం నిజంగా సాధ్యం అవుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం.. బ్యాటరీల ధరలు ఎక్కువగా ఉండడమే. ఒక వేళ వీటి ధరలు 20 నుంచి 25 శాతం తగ్గితే ఈ వాహనాల ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఇక విద్యుత్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించే క్రమంలో భారత ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే సబ్సిడీలు అందించడంతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తోంది. మరి చూడాలి మంత్రి చేసిన వ్యాఖ్యలు నిజంగానే కార్యరూపం దాల్చుతాయో లేదో.
Also Read: జాక్ పాట్ కొట్టేసింది, పంజాబ్ లో తుక్కు సామాన్ల డీలర్ భార్యకు లాటరీలో రూ. కోటి ప్రైజ్