Health Insurance: ఆరోగ్య బీమా తీసుకోవడం లాభామా.. నష్టమా.. హెల్త్ ఇన్య్సూరెన్స్‌లో ఎన్ని రకాలున్నాయంటే..
హెల్త్ ఇన్య్సూరెన్స్ తీసుకోమంటే చాలా మంది గతంలో లైట్ తీసుకునేవారు. ప్రస్తుతం వేతన జీవుల్లో చాలా మంది ఆరోగ్య బీమా తీసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి ప్రధాన కారణం..

Health Insurance: హెల్త్ ఇన్య్సూరెన్స్ తీసుకోమంటే చాలా మంది గతంలో లైట్ తీసుకునేవారు. ప్రస్తుతం వేతన జీవుల్లో చాలా మంది ఆరోగ్య బీమా తీసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులని చెప్పుకోక తప్పదు. పూర్వకాలం మనుషుల జీవనశైలితో పోలిస్తే.. ఆధునిక కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పులతో పాటు రకరకాల జబ్బులు పుట్టు కొస్తున్నాయి. ఎప్పుడు ఏ వ్యాధి బారిన పడతామో తెలియని పరిస్థితి నెలకొంది. ఏదైనా ఆరోగ్య సమస్యల బారిన పడితే ఆసుపత్రుల ఖర్చు తలకుమించిన భారమవుతోంది. సంపాదించిన సంపాదనలో ఎక్కువ భాగం వైద్యానికే పెట్టాల్సి వస్తుంది. ఈక్రమంలో ఎవరైనా వ్యక్తి లేదా కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే వైద్యానికి అయ్యే ఖర్చు భారం కాకుండా కాపాడటానికి అనేక ఆరోగ్య బీమా పథకాలు ఉన్నాయి. దంతాలకు చేసే రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ మొదలు గుండె శస్త్ర చికిత్సల వరకు అన్ని రకాల వైద్య సేవలను కవర్ చేసే హెల్త్ ఇన్య్సూరెన్స్ లు ఎన్నో ఉన్నాయి. కేవలం రుగ్మతలకే కాకుండా వాహన ప్రమాదాలకు బీమా ఇచ్చే పాలసీలు ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా వార్షిక ప్రీమియానికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన పెరగడంతో ఆరోగ్య బీమాలు తీసుకుంటున్నవారి శాతం ఇటీవల కాలంలో పెరిగింది. మారుతున్న జీవనశైలి కారణంగా ఆరోగ్య బీమా పథకాలకు డిమాండ్ పెరిగింది.
ప్రస్తుతం దేశంలో ఉండే కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులకు తప్పనిసరిగా ఆరోగ్య బీమా సౌకర్యం ఉంటుంది. కానీ ఇది ఉద్యోగులందరినీ దృష్టిలో పెట్టుకుని తీసుకున్న పాలసీ కనుక మన అవసరలకు తగినట్టుగా ఉండే అవకాశం తక్కువుగా ఉంటుంది. చాలా కంపెనీలలో వాహన ప్రమాదానికి బీమా సౌకర్యం ఉండదు. అలాగే కేటరాక్ట్ చికిత్స లేదా రూట్ కెనాల్ లాంటివి కంపెనీ బీమా కవరేజ్‌లో ఉండవు. ఇవి కాకుండా, కుటుంబం మొత్తానికి కవరేజ్ ఉండక పోవచ్చు. ఇవన్నీ క్షుణ్ణంగా బేరీజు వేసుకుని తగిన ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఎంతైనా అవసరం.
కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పథకాలతో పేద, మధ్య తరగతి ప్రజల వైద్య ఖర్చులు భరిస్తున్నాయి. ఈ పథకాల వల్ల కొంత వరకూ ఉపయోగం ఉన్నా అన్ని వేళలా ఈ పథకాలు మన అవసరాలకు సరిపోకపోవచ్చు. ముందుగా ఈ పథకాలు అల్పాదాయ వర్గాలకు మాత్రమే వర్తిస్తాయి అందరికీ ఈ పథకాలు వర్తించవు. ఒకవేళ ఆదాయం తక్కువగా ఉన్న ఉద్యోగులకు వర్తించినా, అందులో ఎన్నో షరతులు ఉంటాయి., అన్ని రకాల చికిత్సలకు ఈ పథకాల ద్వారా లబ్ది పొందే అవకాశం తక్కువ. మరోవైపు ఈ పథకాల వల్ల లబ్ది పొందటానికి ప్రభుత్వ ఆసుపత్రి లేదా, ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రులకు మాత్రమే వెళ్లాలనే నియమాలు ఉండచ్చు. మనకు అవసరమైన చికిత్స మనకు దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండకపోవచ్చు. అందువల్ల ప్రతీ ఒక్కరు తమ అవసరాలకు తగినట్టుగా ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం.




ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను కదా.. బీమా ఎందుకులే అనుకుంటారు. ఆరోగ్యంగా ఉన్న వారికి బీమా అవసరం లేదనే వాదన సరైనది కాదు. సహజంగా నలభై సంవత్సరాలలోపు వయసు ఉన్నవారికి వైద్య ఖర్చులు తక్కువగానే ఉంటాయి. కాబట్టి ఆరోగ్య బీమా, జీవిత బీమా అవసరం ఈ సమయంలో తక్కువగానే ఉంటుంది. కానీ, వయసు పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ప్రధానంగా మధుమేహం, రక్తపోటు లాంటివి వంశపారపర్యంగా వస్తున్న రుగ్మతలు. వీటి బారిన పడే అవకాశం వయసుతో పాటూ పెరుగుతుంది. అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య బీమా తీసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..



