Aadhaar Card: ఆధార్‌కార్డ్ అప్‌డేట్స్ విషయంలో ఆ నిబంధనలు తెలుసా? ఎన్నిసార్లు అప్‌డేట్ చేయించుకోవచ్చంటే?
భారతదేశంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన రుజువుగా మారింది. పాఠశాలలో చేరడం నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు ప్రతిచోటా ఆధార్‌కార్డు తప్పనిసరైంది. అయితే ఈ ఆధార్ కార్డులో ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే దాన్ని కరెక్షన్ చేయించుకోవాలని అందరికీ తెలుసు. కానీ ఆధార్ కార్డు అప్‌డేట్స్ విషయంలో నిబంధనలు కూడా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఆధార్ కార్డులోని ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే మనం ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డులో పేరు, మొబైల్ నంబర్, ఇంటి చిరునామా, జెండర్ మొదలైన సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి వేర్వేరు పరిమితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆధార్ కార్డులోని కొన్ని వివరాలను ఎన్నిసార్లైనా అప్‌డేట్ చేసుకునే సదుపాయం ఉండగా, మరికొన్ని వివరాలు ఒకసారి మాత్రమే అప్‌డేట్ చేసుకునే వీలు ఉంది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులోని ఏయే వివరాలు ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చనే కీలక వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
మొబైల్ నంబర్
ఆధార్ కార్డులోని మొబైల్ నంబర్ తప్పుగా ఉంటే లేదా మీరు మీ నంబర్‌ను మార్చి ఉంటే మీరు మీ మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్‌ను ఎన్నిసార్లైనా మార్చే సదుపాయం అందుబాటులో ఉంది.
పేరు
మీరు ఆధార్ కార్డులో మీ పేరును కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే మీరు మీ ఆధార్‌లో పేరును అప్‌డేట్ చేస్తే కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆధార్‌లో పేరు మార్చడానికి యూఐడీఏఐ కేవలం రెండు అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అంటే మీరు మీ మొత్తం జీవితంలో రెండుసార్లు మాత్రమే పేరును అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
పుట్టిన తేదీ
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే మీరు దానిని కూడా మార్చవచ్చు. పుట్టిన తేదీకి సంబంధించి యూఐడీఏఐ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. మీరు ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేసుకునే వీలు ఉంటుంది. పుట్టిన తేదీ అప్‌డేట్ చేసుకోవడానికి జనన ధ్రువీకరణ పత్రం లేదా విద్యా ధ్రువీకరణ పత్రం వంటి పత్రాలు అవసరం అవుతాయి.
చిరునామా
మీరు ఆధార్ కార్డు తీసుకునే సమయంలో వేరే ప్రదేశంలో నివసిస్తుంటే ఇప్పుడు మీ ఇల్లు మారి ఉంటే, మీరు ఆధార్ కార్డులోని ఇంటి చిరునామాను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ లాగానే మీరు మీ ఇంటి చిరునామాను ఎన్నిసార్లైనా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సౌకర్యాలు
ఆధార్ కార్డులోని విషయాలను అప్‌డేట్ చేయడానికి యూఐడీఏఐ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సౌకర్యాలను అందిస్తుంది. అయితే ఆన్‌లైన్ ద్వారా కొన్ని వివరాలను మాత్రమే అప్‌డేట్ చేసుకునే వీలు ఉంటుంది. ఇంటి చిరునామా, పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి ఏదైనా సమాచారం అప్‌డేట్ చేయాలనుకుంటే ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా చేసుకోవచ్చు. అయితే మీరు మీ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటే లేదా మీ మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటే కచ్చితంగా మీరు ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








