Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID Crisis: మందగమనంలో ఆర్థిక వ్యవస్థ.. తగ్గుతున్న వినియోగశక్తి.. అన్నిరంగాలపై ప్రభావం ఉంటుందన్న రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా

కరోనా మహమ్మారి దెబ్బకు కీలక రంగాలన్నీ కుదేలైపోయాయి. మొదటి దశలో కరోనా దెబ్బకు విలవిలాడిన భారత ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో కాస్త మెరుగుపడింది

COVID Crisis: మందగమనంలో ఆర్థిక వ్యవస్థ.. తగ్గుతున్న వినియోగశక్తి.. అన్నిరంగాలపై ప్రభావం ఉంటుందన్న రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా
Indian Economy
Follow us
Balaraju Goud

|

Updated on: May 20, 2021 | 2:28 PM

 Indian economy: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. వృద్ధిరేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కరోనా మహమ్మారి దెబ్బకు కీలక రంగాలన్నీ కుదేలైపోయాయి. మొదటి దశలో కరోనా దెబ్బకు విలవిలాడిన భారత ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో కాస్త మెరుగుపడింది. కోలుకుంటుందని అనుకున్న తరుణంలో సెకండ్ వేవ్ భారీగా విరుచుకుపడింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో స్థూల ఆర్థిక గణాంకాలు రాణిస్తున్నాయన్నది నిజమే కానీ.. అది గతేడాది ఉన్న తక్కువ ప్రాతిపాదిక కారణంగా అని గుర్తుంచుకోవాలని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా స్పష్టం చేసింది. ఇదే సమయంలో కరోనా మలి విడత కారణంగా వినియోగదారు సెంటిమెంటు దెబ్బతిందని దీని వల్ల ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా పయనించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.

సెకండ్ వేవ్ ప్రారంభంలో కాస్త పురోగతి సాధించినట్లు కనిపించినప్పటికీ రోజుకు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం, మరణాల సంఖ్య పెరుగుతుండం సామాన్యులపై భారీగా ఎఫెక్ట్ పడింది. ప్రస్తుత తరుణంలో ప్రాణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వినియోగదారులు కొనుగోలు శక్తి తగ్గింది. దీంతో తక్కువ ప్రాతిపదిక ఉన్నా ఏప్రిల్‌లో చాలా వరకు రంగాల్లో పెద్దగా వృద్ధి కనిపించలేదు. కరోనా అతిపెద్ద సమస్యగా మారడమే ఇందుకు నిదర్శనం అని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.

మరోవైపు వినియోగదారు సెంటిమెంట్ బాగా క్షీణించడం, అధిక ఆరోగ్య సరంక్షణ, ఇంధన బిల్లుల కారణంగా సమీప భవిష్యత్‌లో కొనుగోళ్లు పరిమితంగానే ఉండొచ్చు. అంతే కాదు కాంట్రాక్టు ఆధారిత సేవలపై వ్యయాలనూ కోత విధించవచ్చు. ఇదంతా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చని ఇక్రా తెలిపింది.

గతేడాది ఏప్రిల్‌లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా అన్నీ రంగాలు కుదేలయ్యాయి. అందుకే ఈ ఏప్రిల్‌లో కొన్ని రంగాల్లో భారీ వృద్ధి కనిపించింది. అయితే, ఏప్రిల్‌లో 13 ఆర్థికేతర సూచీల్లో ఎనిమిది కరోనా ముందు స్థాయిల కంటే దిగువనే ఉన్నాయని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ అంటున్నారు.

జీఎస్‌టీ ఇ-వే బిల్లులు, విద్యుదుత్పత్తి, వాహన రిజిస్ట్రేషన్లు, రైలు రవాణా రద్దీ వంటి రంగాలు మందగమనంలో కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌లో అంతక్రితం నెలతో పోలిస్తే డీలా పడ్డాయి. కేసుల వ్యాప్తి, స్థానిక లాక్‌డౌన్‌లు ఇందుకు కారణమయ్యాయి. ఈ ధోరణి మే నెలలోనూ కొనసాగనుందని ప్రాథమిక డేటా చెబుతున్నట్లు వివరించారు. ఇక, బ్యాంకు డిపాజిట్లు తప్ప మొత్తం 15 హై ఫ్రీక్వెన్సీ సంకేతాల్లో 14 మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో మెరుగయ్యాయి. అందులో వాహన రిజిస్ట్రేషన్లు, వాహన ఉత్పత్తి, జీఎస్‌టీ ఇ-వే బిల్లులు ఉన్నాయి.మొత్తంగా చూస్తే, మన్నికైన వినియోగదారు వస్తువులపై వ్యయాలు పరిమితంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

కరోనా మహమ్మారి దెబ్బకు కీలక రంగాలన్నీకుదేలైపోయాయి. అటు దేశంలోని కుబేరులకు కూడా కరోనా పోటు తప్పలేదు. గత వారం స్టాక్‌ మార్కెట్లు పడిపోవడం.. ఎగుమతులకు డిమాండ్‌ తగ్గడం.. ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా చూపించిన ప్రభావం వీరిపై కూడా పడింది. దీంతో వీరి సంపద భారీగా తగ్గింది.

Read Also…. AP Budget 2021 Live: సంక్షేమానికే పెద్ద పీట వేసిన ఏపీ ప్రభుత్వం.. 2021-22 వార్షిక బడ్జెట్‌ హైలైట్స్ ఇవే..