Cooking oil price: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం… మన వంటింట్లో మంట.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
వంట నూనె ధర మండుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మన వంటింట్లో మంట పుట్టిస్తోంది. ఆయిల్ ధరలు మార్కెట్లో ఒక్కసారిగా పెరిగిపోయాయి. అమాంతం పెరిగిన ధరతో సామాన్యుడి గుండె గుబెల్ మంటోంది.
Sunflower Oil Price: వంట నూనె ధర మండుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మన వంటింట్లో మంట పుట్టిస్తోంది. ఆయిల్ ధరలు మార్కెట్లో ఒక్కసారిగా పెరిగిపోయాయి. అమాంతం పెరిగిన ధరతో సామాన్యుడి గుండె గుబెల్ మంటోంది. ఇది ఉక్రెయిన్ పెట్టిన మంటా? లేదంటే వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరతో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రష్యా- ఉక్రెయిన్ దేశాల యుద్ధాన్ని సాకుగా చూపి ధరలను అమాంతం పెంచేశారు. పామాయిల్ రూ.120, వేరుశనగ నూనె రూ.165, పొద్దుతిరుగుడు నూనె లీటరు రూ.135, ఉన్నాయి. సాధారణంగా మార్కెట్లో వంటనూనెలు ఎమ్మార్పీ కన్నా రూ.10 వరకు తక్కువ ధరకే అమ్ముతారు. అయితే ప్రస్తుతం ఎమ్మార్పీ కన్నా రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
మార్కెట్లో ధరలు పెరగడంతో ఏపీలో అధికారులు అప్రమత్తమయ్యారు. విజిలెన్స్ అధికారులు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తిరుపతిలో ఎడిబుల్ ఆయిల్స్ ధరలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు నిర్వహిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సాకుతో అధిక ధరలకు నిత్యావసరాలు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా వ్యాప్తంగా దాడులు చేపట్టారు విజిలెన్స్ అధికారులు. తూనికలు కొలతల శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్త దాడుల్లో వ్యాపారుల అక్రమాలు వెలుగు చూశాయి. అధిక ధరలకు వంట నూనెలు అమ్ముతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. చిత్తూరులో 3, తిరుపతిలో 5, పిలేరులో 2 కేసులు నమోదయ్యాయి.
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అధికారలు దాడులు నిర్వహించారు. ఏలూరు, తాడేపల్లి గూడెం, పెనుగొండ, పాలకొల్లులో కిరాణా, హోల్ సేల్ మార్టుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయిల్ నిల్వలు తనిఖీ చేసిన అధికారులు.. ఏలూరు హ్యాపీ మార్ట్‌పై రెండు కేసులు నమోదు చేశారు. కృత్రిమ కొరత లేకుండా అక్రమ నిల్వలపై ఫోకస్ పెట్టారు అధికారులు. గుంటూరు జిల్లాలో విజిలెన్స్ దాడులు నిర్వహించింది. తెనాలి, బాపట్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లిలో వంటనూనెల గోదాములపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. గోదాముల్లో రికార్డులు తనిఖీ చేశారు అధికారులు. తూర్పు గోదావరి జిల్లాలో విజిలిన్స్ దాడులు వ్యాపారులకు దడ పుట్టిస్తున్నాయి. రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురం, అమలాపురంలో హోల్ సేల్ ఆయిల్ షాపుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. కాకినాడ అగర్వాల్ రిఫనరి ఆయిల్ కంపెనీలో విజిలెన్స్ ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో ధరలు తనిఖీ చేశారు. ఆయిల్ అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేసి షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు విజిలెన్స్ ఎస్పీ రవి ప్రకాష్
కర్నూలు జిల్లా ఆదోని వంటనూనె విక్రయ దుకాణాలపై విజిలెన్స్ దాడులు నిర్వహించింది. లైసెన్స్ లేకుండా నూనె విక్రయిస్తున్న 2 దుకాణాల సీజ్ చేసింది. నంద్యాల గెలివి ఆయిల్ మిల్స్ పై ఆకస్మిక తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు స్టాక్ వివరాలు అరా తీశారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఆయిల్ 60 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ నిల్వ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
Also Read: Fuel Prices: మళ్లీ పెట్రో బాంబ్.. బాదుడే బాదుడు.. సామాన్యుడిపై మోయలేని భారం..