AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol: ఇదేందయ్యా ఇది.. భారత్ నుంచి పెట్రోల్ కొని చాలా తక్కువ ధరకే అమ్మేస్తున్నారుగా.. ఎక్కడో తెలుసా..?

భారతదేశంలో పెట్రోల్ సగటు ధర లీటరుకు రూ.101 ఉండగా, భూటాన్‌లో అదే పెట్రోల్ లీటరుకు రూ.58.8 గా ఉంది. భూటాన్ మన దేశం నుండి ఎక్కువ పెట్రోల్‌ను కొనుగోలు చేస్తుంది. కానీ అక్కడ తక్కువ రేట్లు ఉండడం గమనార్హం. ఎందుకో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Petrol: ఇదేందయ్యా ఇది.. భారత్ నుంచి పెట్రోల్ కొని చాలా తక్కువ ధరకే అమ్మేస్తున్నారుగా.. ఎక్కడో తెలుసా..?
Petrol Price
Krishna S
|

Updated on: Jul 27, 2025 | 9:13 PM

Share

మన దేశంలో పెట్రోల్ రేట్లు ఎప్పుడూ చర్చనీయాంశమే. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా మన దగ్గర మాత్రం తగ్గవు. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు లీటరుకు రూ.94.72 నుండి రూ.107.50 వరకు ఉంటుంది. ఇదే సమయంలో పొరుగు దేశమైన భూటాన్‌లో పెట్రోల్ లీటరుకు రూ.58 నుండి రూ.67 రూపాయలకే లభిస్తుంది. పైగా మన దేశం నుంచి భూటాన్ పెట్రోల్ కొనుగోలు చేస్తుంది. మన దగ్గరి నుండి పెట్రోల్ కొనుగోలు చేసే దేశం ఇంత చౌకగా ఎలా అమ్ముతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

మన దేశంలో పెట్రోల్ ఎందుకు ఖరీదైనది?

దేశంలో పెట్రోల్ ధర అంతగా పెరిగడానికి పన్నులే కారణం. ఒక వ్యక్తి లీటర్ పెట్రోల్ కొట్టిస్తే.. దానిలో ఎక్కువ భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకే వెళ్తాయి. కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర వ్యాట్, డీలర్ కమిషన్ వంటివి ఉంటాయి. అందుకే మనదేశంలో పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గినప్పటికీ, దేశ ప్రజలకు దాని ప్రత్యక్ష ప్రయోజనం లభించకపోవడానికి ఇదే కారణం. ప్రభుత్వ పన్ను విధానం చాలా భారీగా ఉండటం వల్ల పెట్రోల్ ధర దాని మూల ధర కంటే చాలా రెట్లు పెరుగుతుంది.

పన్నులు ఈ విధంగా..

  • డీలర్లకు విధించే ధర – రూ.57
  • డీలర్ కమిషన్ (సగటు) – రూ.3.77
  • కేంద్ర ఎక్సైజ్ సుంకం – రూ.19.90
  • రాష్ట్ర వ్యాట్  – రూ.28

భూటాన్‌లో ఎందుకు చౌకగా..?

భూటాన్ ప్రభుత్వం భారతదేశం నుండి పెట్రోల్‌ను కొనుగోలు చేస్తుంది. కానీ తక్కువ పన్ను లేదా సబ్సిడీ ద్వారా పౌరులకు చౌక ధరకు అందుబాటులో ఉంచుతుంది. అంటే అక్కడి ప్రభుత్వం పౌరులపై పన్ను భారాన్ని మోపదు. అందుకే భూటాన్‌లో అదే పెట్రోల్‌ను లీటరుకు రూ.58 నుండి రూ.67 వరకు విక్రయిస్తున్నారు. భూటాన్ మొత్తం 8 లక్షల జనాభా కలిగిన చిన్న దేశం మరియు అక్కడ పెట్రోల్ వినియోగం చాలా పరిమితం. అటువంటి పరిస్థితిలో, పంపిణీ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. సబ్సిడీని నిర్వహించడం సులభం. దీనితో పాటు, భూటాన్ పెట్రోల్‌పై ఎటువంటి భారీ ఎక్సైజ్ సుంకాన్ని విధించదు.

ఈ దేశాలలో పెట్రోల్ చౌక..

మన దేశంలో సగటు పెట్రోల్ ధర లీటరుకు రూ.101 నుంచి 107 మధ్యలో ఉంది. చైనా, అమెరికా, ఇరాన్, లిబియా వంటి దేశాల్లో మన దేశం కంటే చాలా తక్కువ ధర ఉంది. అమెరికా వంటి దేశాలు తమ ముడి చమురు అవసరాలలో 60% కంటే ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటుండగా, భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 90% దిగుమతి చేసుకుంటుంది.

మన దేశంలో డైనమిక్ ధరలు..

భారతదేశంలో డైనమిక్ ఇంధన ధరల వ్యవస్థ అమలులో ఉంది. అంటే పెట్రోల్ ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. కానీ ముడి చమురు ధర తగ్గినప్పుడు కూడా, ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించనందున సాధారణ ప్రజలకు పెద్దగా ఉపశమనం లభించదు. దీనితో పాటు రూపాయి బలహీనపడినప్పుడు, దిగుమతుల రేట్లు ఎక్కువవుతాయి. ఇది పెట్రోల్, డీజిల్ ధరను మరింత పెంచుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కూడా పెట్రోల్ ద్రవ్యోల్బణాన్ని నిరంతరం పెంచుతుంది.