PMMY: కూలి పనుల నుంచి సొంత వ్యాపారాలు.. ఆ పథకంతో మహిళా ప్రగతికి ఊపిరి
ఆధునిక మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతూ ముందుకు సాగుతున్నారు. పురుషులతో దీటుగా పనిచేస్తూ విజయాలు సాధిస్తున్నారు. కుటుంబంలో చదువుకున్న మహిళ ఉంటే ఆ కుటుంబం తప్పకుండా ఉన్నతి స్థితికి చేరుకుంటుంది. తద్వారా సమాజం, దేశం కూడా ప్రగతి బాటలో పయనిస్తాయి. అదే మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగితే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఆమె ఉన్నత స్థితికి చేరడంతో పాటు మిగిలిన వారికి ఉపాధి కల్పిస్తుంది. పొదుపునకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎన్నో చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) ద్వారా ఎంతో ప్రోత్సాహం అందిస్తోంది.

గతంలో మహిళలు కేవలం కూలి పనులపైనే ఎక్కువగా ఆధారపడేవారు. చిన్న పరిశ్రమల స్థాపన అనేది వారికి అందని అంశంగా ఉండేది. దానికి ప్రధాన కారణం పెట్టుబడి. తినటానికే ఇబ్బంది పడే కుటుంబాలు ఇక పెట్టుబడిని ఎక్కడ తెస్తాయి. ఈ పరిస్థితిని పీఎంఎంవై సమూలంగా మార్చింది. ఈ పథకం ద్వారా రుణాలు పొందిన మహిళలు టైలరింగ్ యూనిట్లు, బ్యూటీ పారర్లు, ఫుడ్ స్టాళ్లు, అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు, రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇది కేవలం వారింటి ఆర్థిక పరిస్థితినే కాదు, సమాజంలో కూడా గొప్ప మార్పును తీసుకువచ్చింది.
మహిళలు ఆర్థికంగా బాగున్నప్పుడు వారి పిల్లల చదువు, ఆరోగ్యం బాగుంటుంది. వాటికి ఖర్చు చేయగలిగే ఆర్థిక స్థోమత కలుగుతుంది. తద్వారా భవిష్యత్తు తరాలు ఉన్నతంగా ఎదుగుతాయి. ఈ విధంగా పీఎంఎంవై కేవలం సూక్ష్మ వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే కాదు, సాధికారత కలిగిన, ఆర్థికంగా చురుకైనా మహిళలను తయారు చేస్తోంది. ప్రధానమంత్రి ముద్ర యోజన రుణాలు తీసుకున్న లబ్ధిదారులతో సుమారు 68 శాతం మహిళలే ఉన్నారు. ఈ పథకం కింద ప్రతి మహిళకు రుణ పంపిణీకి సంబంధించిన సీఏజీఆర్ 2016 నుంచి 2025 ఆర్థిక సంవత్సరాల మధ్య 13 శాతం ఉంది. ఇది రూ.62,679కి చేరుకుంది. అలాగే మహిళల పొదుపులు (డిపాజిట్లు) 14 శాతం పెరిగాయి. రుణాలను తీసుకోవడంతో పాటు, వాటిని ఉపయోగించుకోవడం వల్ల జరిగిన ఆర్థిక ప్రగతిని కూడా ఇవి సూచిస్తున్నాయి.
పీఎంఎంవై మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో మహిళా సాధికారత, ప్రగతి కోసం మరింత కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. అర్హత కలిగిన మహిళలకు మరింత పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం, వ్యాపార విస్తరణకు అవకాశం కల్పించడం చేయాలి. పీఎంఎంవై పథకాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. తయారీ, వాణిజ్యం, సేవల రంగాల్లోని కార్పొరేటేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ సంస్థలకు, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలకు సుమారు రూ.10 లక్షల వరకూ రుణాలు అందిస్తారు. శిశు పథకం కింద రూ.50 వేల వరకూ, కిశోర్ ద్వారా రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకూ, తరుణ్ ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ, తరుణా ప్లస్ ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ అందిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..