Railway income: అమెరికాను దాటేసిన భారతీయ రైల్వే.. ఆ విషయంలో మనమే కింగ్..!
దేశంలోని ప్రముఖ రవాణా సాధనాల్లో రైలుదే ప్రథమస్థానం. నిత్యం కోట్ల మంది ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు దీనిలో ప్రయాణం చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయుల జీవితాలకు రైలుతో విడదీయలేని అనుబంధం ఉంది. భారతీయ రైల్వేలో అనేక మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి జీతాలు, ఇంధనం ఖర్చులు, నిర్వహణ కోసం కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఆదాయం కూడా భారీగానే వస్తుంది. ఇలా ఆదాయ, వ్యయాల మధ్య నిష్పత్తినే రైల్వే ఆపరేటింగ్ రేషియో (ఓఆర్) అంటారు. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓఆర్ 98.32గా నమోదైంది. సరుకు రవాణా విషయంలో అమెరికాను దాటి రెండో స్థానంలో నిలిచింది.

రైల్వే శాఖ ఆర్థిక ప్రగతికి ఓఆర్ చాలా కీలకంగా ఉంటుంది. దీని ప్రకారం 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు రూ.100 సంపాదించడానికి రూ.98.32 ఖర్చు చేసింది. మొత్తం వ్యయం రూ.2.63 లక్షల కోట్లు కాగా, ఆదాయం రూ.2.65 లక్షల కోట్లుగా నమోదైంది. ఇక 2023-24 ఆర్ఠిక సంవత్సరంలో వ్యయం రూ.2.52 లక్షలు కోట్లు కాగా, ఆదాయం రూ.2.56 లక్షల కోట్లు సంపాదించింది. మొత్తానికి గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం స్పల్పంగా ఓఆర్ తగ్గింది. రైల్వే శాఖకు ఆదాయం వివిధ మార్గాల నుంచి భారీగానే వస్తుంది. ప్రయాణికుల టిక్కెట్లు, సరకుల రవాణా, స్టేషన్లలో దుకాణాల అద్దెలు తదితర విధానాల్లో సొమ్ములు వస్తాయి. వాటిలో ప్రయాణికుల ఆదాయం గతంలో కంటే 6.4 శాతం ఎక్కువ నమోదైంది. ఆదాయం రూపంలో చెప్పాలంటే రూ.75.239 కోట్లు వచ్చింది. ఇక 2023-24లో రూ.1.68 లక్షల కోట్లుగా ఉన్న వస్తువుల ఆదాయం 2024-25లో 1.7 శాతం పెరిగి, రూ.1.71 లక్షల కోట్లకు చేరింది. ఇతర వనరుల నుంచి 19.8 శాతం భారీ నమోదు చోటు చేసుకుంది. ఈ మొత్తం దాదాపు 11,562 కోట్ల రూపాయలను దాటేసింది.
రైల్వే శాఖ ఆదాయంలో ప్రతి ఏటా పెరుగుదల నమోదవుతూనే ఉంది. 2024-25 తో వరుసగా నాలుగో సంవత్సరం కూడా సరుకు రవాణాలో మెరుగుదలను చవిచూసింది. ఆదాయంలో రికార్డులు నెలకొల్పింది. ముఖ్యంగా ఈ ఏడాది సరుకు రవాణా 1.61 బిలియన్ టన్నులు దాటింది. తద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. సరుకు రవాణా విభాగంలో అమెరికాను దాటి రెండో స్థానంలో నిలిచింది. ఏటా రైల్వే నెట్ వర్క్ ద్వారా సరుకును రవాణా చేసే దేశాలలో చైనా ప్రథమస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలోకి మన దేశం చేరడంతో అమెరికా ఆ తర్వాత స్థానానికి పరిమితమైంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతీయ రైల్వేలకు తాత్కాలిక నికర ఆదాయం రూ.2,342 కోట్లుగా ఉంది. అదే 2023-24లో రూ.3259.68 కోట్లుగా నమోదైంది. ఇక 2025-26 బడ్జెట్ లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3,041 కోట్ల నికర ఆదాయం వస్తుందని అంచనా వేశారు. దీనిలో ప్రయాణికుల నుంచి రూ.92,800 కోట్లు, సరుకు రవాణా నుంచి రూ.1,88,000 కోట్ల వస్తాయని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..