తరచుగా ఉద్యోగాలు మారే వారికి హెచ్చరిక.. వాటి విషయంలో జాగ్రత్త.. లేదంటే తిరిగి చెల్లించాల్సిందే..?
Job Change: తరచుగా మీరు ఉద్యోగాలు మారుస్తున్నారా.. అయితే ఈ విషయం తెలిస్తే ఖంగుతింటారు. ఐటీ ఇంజినీర్ రాజేశ్ బెంగుళూరులో మూడేళ్లు పనిచేసి తిరిగి హైదరాబాద్ వచ్చాడు. తన పాత ఖాతా గురించి
Job Change: తరచుగా మీరు ఉద్యోగాలు మారుస్తున్నారా.. అయితే ఈ విషయం తెలిస్తే ఖంగుతింటారు. ఐటీ ఇంజినీర్ రాజేశ్ బెంగుళూరులో మూడేళ్లు పనిచేసి తిరిగి హైదరాబాద్ వచ్చాడు. తన పాత ఖాతా గురించి తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ మేనేజర్ ఆరు వేల రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పడంతో కంగుతిన్నాడు. అసలు విషయం ఏంటంటే రాజేశ్ ఇప్పుడు పనిచేసే ఉద్యోగానికి సంబంధించి సాలరీ ఆ పాత ఖాతాలో పడుతుంది. ఎందుకంటే అదే బ్యాంకులో మరో కొత్త ఖాతా ఓపెన్ చేయలేరు. ఈ సమస్య ఒక్క రాజేశ్‌కి మాత్రమే కాదు ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్నారు. తరచూ ఉద్యోగాలు మారుతూ పాత సాలరీ ఖాతాలని క్లోజ్ చేయకపోవడం వల్ల ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిజానికి సాలరీ ఖాతా జీరో బ్యాలెన్స్‌పై నడుస్తుంది. కానీ మూడు నెలల పాటు అందులో జీతం డబ్బులు పడకపోతే అది సేవింగ్స్ ఖాతా కేటగిరీలోకి వస్తుంది. నిబంధనల ప్రకారం.. సేవింగ్స్ ఖాతాలలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. అది ఎంతంటే బ్యాంకుని బట్టి 500 రూపాయల నుంచి 10 వేల వరకు ఉంటుంది. కనీస మొత్తం ఉంచకపోతే, బ్యాంక్ తన పాలసీ ప్రకారం మీ ఖాతా నుంచి డబ్బును తీసివేయడం ప్రారంభిస్తుంది. బ్యాంకులో ఖాతా తెరవడానికి ఛార్జీ లేదు కానీ చాలా బ్యాంకులు తమ డెబిట్ కార్డ్‌పై కొంత రుసుమును వసూలు చేస్తున్నాయి. ఈ రుసుములు సంవత్సరానికి 100 నుంచి 1000 వరకు ఉంటున్నాయి. మీరు మీ ఖాతాను ఉపయోగించకపోయినా డెబిట్ కార్డ్ రుసుమును చెల్లించవలసి ఉంటుంది. బ్యాంకులు మీ ఫోన్‌కి SMS పంపడానికి ఛార్జీని వసూలు చేస్తాయి. ఇది త్రైమాసికానికి రూ. 30 వరకు ఉంటుంది. ఈ మొత్తంపై ప్రత్యేకంగా 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ఈ విధంగా బ్యాంకు మీ ఖాతా నుంచి వివిధ సేవల పేరుతో డబ్బును తీసివేస్తూనే ఉంటుంది. ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా మీకు పెనాల్టీ వేస్తూనే ఉంటుంది. మీరు ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే బ్యాంక్ మిమ్మల్ని డిఫాల్టర్‌గా ప్రకటిస్తుంది. అంతేకాదు మీ CIBIL స్కోరు దెబ్బతింటుంది.
12 నెలల పాటు లావాదేవీలు జరగకపోతే ఏమవుతుంది?
మీరు వరుసగా 12 నెలల పాటు మీ బ్యాంక్ ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరపకుంటే బ్యాంకు మీ ఖాతాను నిష్క్రియ ఖాతాగా పరిగణిస్తుంది. తర్వాత12 నెలల వరకు ఎలాంటి లావాదేవీలు జరపకపోతే ఈ ఖాతా డోర్మాంట్ ఖాతా కేటగిరీ కిందకు వస్తుంది. నిష్క్రియ ఖాతాలో బ్యాంకు లావాదేవీలను బ్యాంకులు నిషేధించనప్పటికీ నెట్ బ్యాంకింగ్, ATM లావాదేవీలు లేదా మొబైల్ బ్యాంకింగ్ చేయలేరు. వాస్తవానికి జరిమానా గురించి బ్యాంకులు కస్టమర్‌కు తెలియజేయాలి. ఖాతాలో జమ చేసిన మొత్తం జీరోగా మారితే దాన్ని మూసివేయాలి. కానీ సంపాదన ముసుగులో బ్యాంకులు నైతికతను పక్కన పెట్టి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నాయి. మొత్తంమీద ప్రస్తుత వ్యవస్థలో అవసరమైన దానికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండటంలో అర్థం లేదు. మీరు ఏ బ్యాంకు ఖాతాను ఉపయోగించకుంటే వెంటనే దాన్ని మూసివేయాలి. లేదంటే భవిష్యత్‌లో చాలా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.