Apple iphones: ఆపిల్ ఫోన్ల ఉత్పత్తిలో కళ్లు చెదిరే రికార్డు.. 2024లో రూ.లక్ష కోట్లకు దాటిన ఎగుమతులు
ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వీటి కోసం ఎదురు చూస్తారు. కొత్త మోడల్ విడుదల కాగానే పోటాపోటీగా కొనుగోలు చేస్తారు. మిగిలిన కంపెనీలతో పోల్చితే ఐఫోన్ల ధర ఎక్కువగా ఉంటుంది. కానీ వీటిలో ఫీచర్లు, టెక్నాలజీతో పోల్చితే ఆ ధర తక్కువ అనే చెప్పవచ్చు. ఐఫోన్ వాడడం స్టేటస్ సింబల్ గా కూడా భావిస్తారు. కాగా.. ఐఫోన్ల ఉత్పత్తిలో మన దేశంలో రికార్డులు నెలకొల్పుతోంది. 2024లో ఐఫోన్ ఎగుమతుల విలువ ఒక లక్ష కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.
దేశంలో ఉత్పత్తి, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం అమలవుతోంది. దేశంలో తయారీ రంగాన్ని పరుగులు పెట్టించడం దీని ప్రధాన ఉద్దేశం. దీని కిందే ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తి కూడా జరుగుతోంది. అది ప్రగతి పథంలో పయనిస్తూ 2024లో దాదాపు రూ.లక్షకోట్లకు చేరుకోవడం గర్వపడాల్సిన విషయం. ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తి మన దేశంలో గణనీయంగా పెరుగుతోంది. 2024లో 12.8 బిలియన్ డాలర్ల (రూ.1.08 లక్షల కోట్లు) విలువైన ఫోన్లు ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యాయి. ఎగుమతుల్లో దాదాపు 42 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ ఉత్పత్తి 46 శాతం పెరిగింది. పీఎల్ఐ పథకంలో భాగంగా ఫాక్స్ కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ తదితర కంపెనీలు మన దేశానికి వచ్చాయి. వీటి ద్వారా సుమారు 1.85 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. ఇలా ఉద్యోగాలు పొందిన వారిలో 70 శాతం మంది మహిళలు ఉన్నారు.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్లూ కాలర్ ఉద్యోగాల కల్పనా కంపెనీగా ఆపిల్ పేరు పొందింది. ఐఫోన్ల ఎగుమతులు ఇలాగే కొనసాగితే కొన్నేళ్లలోనే 20 బిలియన్ డాలర్ల వార్షిక ఉత్పత్తి జరుగుతుందని అంచనా. తద్వారా ఐఫోన్ లో భారత్ వాటా 14 నుంచి 26 శాతానికి చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. తమిళనాడులో ఫాక్స్ కాన్ నిర్వహిస్తున్న ఐఫోన్ ఫ్యాక్టరీ ఉద్యోగుల పరంగా అతి పెద్దది. దీనిలో దాదాపు 42 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో 30 వేల మంది మహిళా కార్మికులు ఉండడం విశేషం. కాగా.. దేశంలో తయారీ రంగాన్ని మరింతగా ప్రోత్సహించి, భారత్ ను తమ ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ఆపిల్ మార్చుకుంటోంది. తద్వారా మన ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక భాగస్వామిగా మారుతోంది.
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని పీఎల్ఐ పథకం అని పిలుస్తారు. దీని ద్వారా దేశంలో ఉత్పత్తిని పెంచే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందజేస్తారు. దీని కింద కంపెనీలకు పన్ను రిబేట్లు దొరుకుతాయి. ఎగుమతి, దిగుమంతి సుంకాలు కూడా తక్కువగా ఉంటాయి. భూమి కొనుగోళ్లలో నిబంధల సడలింపు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి