అదానీకి బిగ్ రిలీఫ్..! 265 మిలియన్ డాలర్ల ఫ్రాడ్ కేసులో కీలక పరిణామం!
భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన భారీ మోసం ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 265 మిలియన్ డాలర్ల లంచం ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ కేసును అమెరికా న్యాయ శాఖ ఉపసంహరించుకునే యోచనలో ఉంది. మరిన్న వివరాలు ఇలా ఉన్నాయి..

భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన భారీ మోసం ఆరోపణల కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 265 మిలియన్ డాలర్ల లంచం ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ కేసును అమెరికా న్యాయ శాఖ ఉపసంహరించుకునే అవకాశముందని అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. దీంతో అదానీ గ్రూప్‌కు పెద్ద ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసు 2024 నవంబర్‌లో అమెరికా ప్రాసిక్యూటర్లు దాఖలు చేసిన అభియోగపత్రంతో ప్రారంభమైంది. భారతదేశంలోని అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలను దక్కించుకోవడానికి భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించారని ఆరోపించారు.
ఈ ఒప్పందాల ద్వారా దాదాపు 2 బిలియన్ డాలర్ల లాభాలు వచ్చే అవకాశముందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అమెరికా అధికారుల ప్రకారం.. సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈఓ వినీత్ జైన్ తదితరులు పెట్టుబడిదారులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్‌ల రూపంలో సమీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిపై సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ కుట్ర కేసులు నమోదయ్యాయి. ఇటీవల అదానీ కొత్త న్యాయ బృందాన్ని నియమించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదుల్లో ఒకరైన రాబర్ట్ జె. గియుఫ్రా జూనియర్ నేతృత్వంలోని ఈ బృందం అమెరికా న్యాయ శాఖ అధికారులతో సమావేశమై కేసులో తగిన సాక్ష్యాలు లేవని వాదించింది.
అదానీ గ్రూప్ అమెరికాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి 15 వేల ఉద్యోగాలు సృష్టించే ప్రతిపాదనను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అదే సమయంలో యు.ఎస్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కూడా సమాంతర సివిల్ కేసును ఆర్థిక జరిమానాలతో పరిష్కరించే దిశగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1988లో ప్రారంభమైన అదానీ గ్రూప్ ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద మౌలిక సదుపాయాల సంస్థలలో ఒకటిగా ఎదిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
