భర్తను కొట్టిన పోలీసు చెంప పగులగొట్టిన భార్య
తమిళనాడులో పోలీసుల తీరుపట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నా.. వారిలో తీరు మారడంలేదు. అందరూ చూస్తుండగానే అనుకోని సంఘటన ఒకటి జరిగింది. భర్తను చితకబాదిన పోలీసు చెంపచెల్లుమనిపించింది ఓ మహిళ.
తమిళనాడులో పోలీసుల తీరుపట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నా.. వారిలో తీరు మారడంలేదు. అందరూ చూస్తుండగానే అనుకోని సంఘటన ఒకటి జరిగింది. భర్తను చితకబాదిన పోలీసు చెంపచెల్లుమనిపించింది ఓ మహిళ.
గత కొద్దిరోజుల క్రితం తండ్రికొడుకులు జయరాజ్, బెనిక్స్ లాకప్ డెత్ తర్వాత తమిళ పోలీసుల ప్రవర్తన పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయినా, పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా భర్తని పోలీసులు రక్తం వచ్చేలా కొట్టడంతో భరించలేకపోయింది ఓ ఇల్లాలు. ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది శివంగిలా మారి ఏకంగా ఎస్సై చెంప పగలగొట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో జరిగింది.
విల్లుపురం జిల్లా అనత్తూర్ గ్రామానికి చెందిన ముత్తురామన్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన షార్ట్‌లిస్ట్‌లో అతని పేరు ఉంది. అయితే ఇళ్ల నిర్మాణ పనులు పర్యవేక్షించేందుకు వచ్చిన ప్రైవేటు కాంట్రాక్టర్ సుభాష్ చంద్రబోస్‌తో ముత్తురామన్‌కు వివాదం తలెత్తింది. ఇంటి కోసం తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని కాంట్రక్టర్‌పై ముత్తురామన్ ఆరోపణలు చేశాడు. దీనిపై తిరువెన్నైనల్లూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో విచారణ కోసం ఎస్సై సహా ఇద్దరు పోలీసులు అనత్తూర్ చేరుకున్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ముత్తురామన్ సరియైన సమాధానం ఇవ్వడం లేదంటూ ముత్తురామన్‌ని రక్తం వచ్చేలా కొట్టారు పోలీసులు. ఇది చూసిన అతని భార్య సారథి కొపంతో తో ఊగిపోయింది. వెనకాముందూ చూసుకోకుండా భర్తని కొట్టిన ఎస్సై చెంప పగలగొట్టింది.
అంతలో అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొట్టడమేంటని ప్రశ్నించారు. గ్రామస్తుల నిరసనతో చేసేదిలేక పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ముత్తురామన్ భార్య పోలీస్‌పై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. డ్యూటీలో ఉన్న అధికారిపై చేయి చేసుకున్న విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. విచారణకు ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.