Good News: ఈ రోజు నుంచి మార్కెట్లోకి రానున్న డీఆర్‌డీవో మందు.. అందుబాటులోకి 6-8 లక్షల 2డీజీ మెడిసిన్
దేశం మొతం ఎదురుచూస్తున్న డీఆర్‌డీవో మందు మార్కెట్లో లభించనుంది. ఈ రోజు అన్ని నగరాల్లో అందుబాటులోకి రానుంది. 2డీజీ డ్రగ్ కూడా సమర్థంగా పనిచేస్తున్నట్లు ఫలితాలొస్తున్నాయని..
దేశం మొతం ఎదురుచూస్తున్న డీఆర్‌డీవో మందు మార్కెట్లో లభించనుంది. ఈ రోజు అన్ని నగరాల్లో అందుబాటులోకి రానుంది. 2డీజీ డ్రగ్ కూడా సమర్థంగా పనిచేస్తున్నట్లు ఫలితాలొస్తున్నాయని డీఆర్‌డీవో ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. వారంలోగా హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ద్వారా 6 నుంచి 8 లక్షల 2డీజీ పొట్లాలను విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా మరిన్ని సంస్థల ద్వారా ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నుంచే ముడి పదార్థాన్ని మరికొన్ని సంస్థలకు ఇచ్చి ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయని అన్నారు. ఇంకో వారంలో దానిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
2DG డ్రగ్ ఇతర దేశాల బయోవార్‌ని డీఆర్‌డీవో ముందే ఊహించి తయారు చేసినట్లు జరుగుతున్న ప్రచారం సరికాదని డాక్టర్ సతీష్‌రెడ్డి కొట్టిపారేశారు. సైనికులపై రేడియేషన్ ప్రభావం పడకుండా ఉండేందుకు పదేళ్లుగా ప్రయోగాలు చేసి దీన్ని తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. కరోనా నియంత్రణలోనూ ఇది పనిచేస్తుందని నమ్మి దేశవ్యాప్తంగా చాలా ఆసుపత్రుల్లో దీన్ని ప్రయోగించి, మంచి ఫలితాలొచ్చాకే అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.
ఈ మందు అన్ని రకాల స్ట్రెయిన్లు, వైరల్ ఇన్‌ఫెక్షన్లపై పనిచేస్తుందని మరోమారు స్పష్టంచేశారు. ప్రస్తుతం కొవిడ్ తీవ్ర, మధ్యస్థ స్థాయిలో ఉన్నవారికే ఇస్తున్నారని, స్వల్ప లక్షణాలున్న వారికీ వాడేందుకు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
భారత్‌తో పాటు ఇతర దేశాలూ 2డీజీ డ్రగ్ కోసం సంప్రదిస్తున్నాయని సతీష్‌రెడ్డి తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకు ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ నుంచి..ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ఆర్డర్ పెట్టుకుంటేనే అందిస్తున్నట్లు సతీష్‌రెడ్డి తెలిపారు. విదేశాలకు ఎగుమతితో పాటు ఇక్కడ కొరత తీర్చేందుకు ఇతర సంస్థల ద్వారా ఉత్పత్తి పెంచనున్నట్లు వివరించారు.